Breaking News

చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!*

110 Views

*చంద్రయాన్-3:చంద్రుడికి మరింత చేరువ..వచ్చే వారమే జాబిల్లిపై అడుగు.!*

 

బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-3 సోమవారంతో నెల రోజులు పూర్తి చేసుకుంది.

 

ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఈ వ్యౌమనౌక.. నేడు జాబిల్లికి మరింత చేరువైంది. చంద్రయాన్‌-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ( ఆర్బిట్ ప్రొడక్షన్ మన్యూవర్ ) విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించింది.

 

చంద్రుడి చుట్టు చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్‌-3కి ఇది రెండో చివరి కక్ష్య. నేటి విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ x 177 కి.మీలకు తగ్గించినట్లు ఇస్రో తెలిపింది. తదుపరి కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని ఆగస్టు 16న ఉదయం 8.30కు చేపట్టనున్నట్లు పేర్కొంది. దీంతో ఈ అంతరిక్ష నౌక.. చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోతుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది.

 

‘చంద్రయాన్‌-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లోకి ప్రవేశపెట్టారు. అక్కడినుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *