Breaking News

అధికారుల తీరు… సీఎం కేసీఆర్ కు సమ్మతమేనా?

72 Views

అధికారుల తీరు
సీఎం కేసీఆర్ కు సమ్మతమేనా..?

తెలంగాణ రాష్ట్రంలో అధికారుల తీరు రాజ్యాంగ విరుద్ధంగా సాగుతోంది. కులమతాలకు.. రాజకీయాలకు .. వర్గ వర్ణ భేదాలకు అతీతంగా పనిచేయాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం.! ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా కొనసాగుతున్న సీఎంవో అధికారి శ్రీమతి స్మిత సబర్వాల్ తీరు చూస్తుంటే రాజకీయ నేతలను మించి కనపడుతోంది. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత హోంమంత్రి అమిత్ షాలకు సవాల్ విసురుతున్నట్టు ట్విటర్లతో విమర్శలకు దిగుతున్నారు. భారతీయ జనతా పార్టీ.. హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ మహిళా హక్కుల కోసం పోరాడుతున్నట్లు స్మిత తన సోషల్ మీడియా లో యుద్ధం కొనసాగిస్తోంది. గతంలో గుజరాత్ లోని “తీస్తా అతుల్ సేత్వాల్” అంశం పైన తీవ్రంగా స్పందించారు. ఇటీవల మణిపూర్ లో జరిగిన మహిళల ఘటనపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సంతోషమే.. ఓ మహిళగా సాటి మహిళలపై జరుగుతున్న వివక్షను, అత్యాచారాలను ఎదుర్కొనేందుకు పోరాడటం అభినందనీయమే. కానీ ప్రాంతాన్ని బట్టి.. రాజకీయ అవసరాలను బట్టి స్పందించడమే సమర్ధనీయం కాదు. బిజెపిని టార్గెట్ చేస్తూ పోస్టు పెట్టడం మరీ దుర్మార్గం. మన తెలంగాణలో లెక్కకు మించి మహిళల అపహరణ ..మిస్సింగ్ ..అత్యాచారాలు ..హత్యలు .. ఘోరాలు .. నేరాలు జరుగుతున్నాయి. కానీ వాటి గురించి కనీసం స్పందించడం లేదు. అయినా నేను కూడా వాటి జోలికి వెళ్ళను. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య అనే ఓ ఎమ్మెల్యే … నవ్య అనే సర్పంచ్ పై వేధింపులకు పాల్పడుతున్న విషయం రెండు తెలుగు రాష్ట్రాలకు తెలియనిదేమి కాదు. అదేవిధంగా చిన్నం దుర్గయ్య అనే ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని శేజల్ అనే ఒక యువతి దేశ రాజధాని ఢిల్లీతో పాటు మన భాగ్యనగరంలో వివిధ రీతిలో న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తోంది. కనీసం ఈ రెండు విషయాలపై నైనా స్మిత స్పందించకపోవడం ఆమె ద్వంద్వనీతిని చెప్పకనే చెబుతోంది. “నేను స్పందించాలంటే బిజెపి పాలిత ప్రాంతాల్లో జరిగే ఘటనలు మాత్రమే కావాలి “అన్నట్టు ఆమె చేస్తున్న మహిళా అభ్యుదయ పోరాటం స్మిత వైఖరిని తెలియజేస్తుంది. తన పక్కనే కూర్చుని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్మిత తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థిస్తారా అని జనం చర్చించుకుంటున్నారు.

తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్

తెలంగాణ వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ గడాల శ్రీనివాసరావు  తీరు వేరే చెప్పక్కర్లేదు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్ పదేపదే ప్రకటించడాన్ని సీఎం కేసీఆర్ సమర్థిస్తారా..? అని తెలంగాణ ప్రజలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే తన రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ఏడాది కాలంగా ఏదో రూపంలో ప్రకటన చేస్తూ ఉచిత ప్రచారం పొందుతున్నారు. ఇటీవల తాజాగా జూలై 30వ తేదీన కొత్తగూడెం క్లబ్ లో గడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. బి ఆర్ ఎస్ టికెట్ ఇస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించడం తగునా..? అంతకుముందు భాగ్యనగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని లీకులు ఇవ్వడం సమంజసమేనా..? మరి ముఖ్యంగా ఆగస్టు 5వ తేదీ నుంచి “కొత్తగూడెం నియోజకవర్గంలో గడప గడపకు గడల” అనే కార్యక్రమంతో ముందుకు సాగుతానని ప్రకటించడం ఒక ప్రభుత్వ ఉద్యోగికి తగునా..? పవిత్రమైన వైద్యరంగంలో పనిచేస్తూ.. అత్యున్నత హోదాలో కూర్చుని ఓ పార్టీకి ప్రతినిధిని అంటూ ప్రకటించుకోవడం రాజ్యాంగబద్ధమేనా..? గతంలో అనేకసార్లు వింత వింత మాటలతో మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ పొందడం ఆయన తెలివిగా చేసుకుంటున్న రాజకీయ ప్రచారమనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ పనుల నిమిత్తం హెల్త్ డైరెక్టర్ కార్యాలయానికి వస్తే ఏమాత్రం కలిసి అవకాశం ఉండదు. ఎందుకంటే అది ఓ రాజకీయ కార్యాలయానికి మించి కార్యకలాపాలు సాగుతూ ఉండటం అక్కడి ప్రత్యేకత. రాష్ట్ర నలు దిక్కుల నుంచి ఉద్యోగులు, ప్రజలు వైద్య సేవల కోసం వచ్చేవారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఉండదు. ఒకవేళ సారు కార్యాలయంలో ఉన్నా.. అక్కడ పరపతిని ఉపయోగించి కలవాల్సిందే..! సాధారణ పౌరులకు సారును కలవడం అసాధ్యం. మరో విశేషం ఏమిటంటే సారు ఎప్పుడు కొత్తగూడెంలో ఉంటారో .. ఎప్పుడు సెక్రటేరియట్ లో ఉంటారో.. ఎప్పుడు తన కార్యాలయంలో ఉంటారో ఎవరికీ తెలియదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, నిరీక్షించి ఊసూరు అనుకుంటూ వెళ్లిపోవడం తప్ప చేయాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే సారుకు నేరుగా ముఖ్యమంత్రి కేసిఆర్ తోనే సంబంధాలు ఉన్నాయని.. హెల్త్ మినిస్టర్ హరీష్ రావు  కూడా నామ మాత్రమేనని అక్కడి సిబ్బంది, గడల సన్నిహితులు వాపోతుండటం మరో విశేషం.

పలుకుబడి ప్రతిష్టాత్మకత కలిగిన ఉద్యోగంలో ఉంటూ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. అసలు ప్రభుత్వ ఉద్యోగులే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. కానీ గడల శ్రీనివాస్ “డాక్టర్ జి ఎస్ ఆర్ ” పేరుతో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఎంతవరకు సమంజసం. ఒకవేళ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తే సంస్థ కొనసాగడానికి నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారు.. దాని కార్యకలాపాలకు సమయం ఏ విధంగా వెచ్చిస్తారు.. తన పరపతిని ఉపయోగించి నిధి సేకరణ చేస్తారా..? అనే విషయంపై స్పష్టత రావాలి. కానీ ఈ విషయాలు ఏవి కూడా పట్టించుకోవడం లేదు.
” వడ్డించేవాడు మనవాడైతే మనకేమి” అన్నట్టు ముఖ్యమంత్రి గారితోనే నేరుగా సఖ్యత ఉండటం వల్ల ఈ అధికారి చేష్టలు మితిమీరిపోతుండటంతో తెలంగాణ వైద్య రంగంలోని ఉద్యోగులు ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ట్రస్ట్ నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలి.

అనధికారికంగా నియామకం

ఎంతోమంది సీనియర్ అధికారులను కాదని.. దాదాపు 8 ఏళ్లుగా అనాధికారికంగా డైరెక్టర్ హెల్త్ కుర్చీలో గడాల శ్రీనివాసరావుని కూర్చోబెట్టడం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం కూడా. ఒకే వ్యక్తి ఒకే కుర్చీలో అనాధికారికంగా ఇన్నేళ్లు కూర్చుంటే.. సాధారణంగా అవినీతికి ఆస్కారం లేకపోలేదు.!

ఐఏఎస్, ఐపీఎస్ లు ఎవరైనా కావచ్చు.. భారత రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందే. లేదంటే స్వచ్ఛందంగా పదవి విరమణ పొంది రాజకీయాల్లో చేరవచ్చు. ఆ తర్వాత ఆయా రాజకీయ పార్టీ జెండా, ఎజెండాకు అనుగుణంగా వారి తీరును మలుచుకోవచ్చు. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ జీతం తీసుకుంటూనే.. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇలాంటి అనేకమంది అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంతలా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకు వస్తున్న అధికారులను సీఎం కేసీఆర్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి అధికారులను ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది అధికారులు కూడా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి అధికారుల తీరును సరి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే.

 

 

భవదీయ

పగుడాకుల బాలస్వామి
అధ్యక్షులు
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( JAT)
(హిందూ జర్నలిస్టు ఫోరం)

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *