పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంలో భాగంగా గ్రామాల్లో అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వీర్నపల్లి మండలం ఎర్రగడ్డతాండ, లాల్ సింగ్ తాండ, గర్జనపల్లి, కోనరావుపేట మండలం మర్రిమడ్ల, నిమ్మపల్లి గ్రామాల్లో పర్యటించి పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. గ్రామాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నది, ఏ ఏ డాక్యుమెంట్లు జతచేస్తున్నది, రశీదులు ఇస్తున్నది, లేనిది, రికార్డుల నిర్వహణ చేస్తున్నది అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పోడు భూముల సమస్యలున్న 66 గ్రామాల్లోని 78 అవాసాల్లో 78 అటవీ హక్కుల కమిటీలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అటవీ హక్కుల కమిటీ ద్వారా పోడు సమస్యలున్న ప్రజల్లో దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించామన్నారు. డిశంబర్, 2005 కంటే ముందు అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులు, మూడు తరాలుగా అటవీ భూమిలో వ్యవసాయం చేస్తున్న ఇతరులు గ్రామ సభలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. స్వీకరించిన దరఖాస్తులను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి రసీదును అందజేయాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల నుంచి అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు నకలు దరఖాస్తుకు జత చేయాలని పేర్కొన్నారు. ఆధారాలు సక్రమంగా లేకపోతే దరఖాస్తులను గ్రామస్థాయిలో తిరస్కరణ చేయవచ్చని సూచించారు. మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులకు అటవీ హక్కుల కమిటీ విధులు, బాధ్యతలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ పర్యటన సందర్భంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, తదితరులు ఉన్నారు.
