*చతుర్థీ వ్రతం,మాస వినాయక చతుర్థీ*. వినాయకునికి ప్రీతి కరమైన రోజు. వినాయక భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి,వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ రోజు వ్రతం ఆచరించడం వలన ప్రారంభించుకొనే పనులలో ఆటంకాలు ఏర్పడవు అని భక్తుల నమ్మకం.
నిరయన రవి, ఆరుద్ర నక్షత్రం లో సా.05.50 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి *ఆరుద్ర కార్తె* ప్రారంభం అవుతుంది.
జూన్ 23 శుక్రవారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం
ఎర్రటి ఎండకు మండి మండి నెర్రలిచ్చిన నేల తొలకరి చినుకుల కోసం తపించిపోతుంది. మేఘం ఉరిమి చినుకు కురియగానే నేలతల్లి తన ఆనందాన్ని మట్టి పరిమళంగా వెదజల్లుతుంది. ఆ చినుకుతడి తగిలిన వెంటనే నేలలోపల నుంచి బిలబిల మంటూ ఎర్రటి పురుగులు బయటకొచ్చేస్తాయి. వీటినే ఆరుద్ర పురుగులు అంటారు.
ఆరుద్ర కార్తె ప్రారంభం కాగానే ఆరుద్ర పురుగులు కనిపిస్తే ఆ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని రైతుల విశ్వాసం. అందుకే ఆరుద్ర పురుగులను తమకు శుభవార్త తీసుకొచ్చే నేస్తాలుగా భావిస్తారు రైతులు. ఎర్రగా బొద్దుగా మెరుస్తూ చూడముచ్చటగా కనిపించే ఇవి బయట కనిపించగానే రైతులంతా ఇక వ్యవసాయ పనులు మొదలెట్టుకోవచ్చని ఫిక్సైపోతారు. ఎందుకంటే ఇవి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి అదికూడా వానలు జోరందుకునే ముందు మాత్రమే భూమిలోంచి బయటకొస్తాయి. అందుకే రైతన్నలకు ఇవి కనిపిస్తే అంత ఉత్సాహం.
అందమైన ఈ పురుగులు ప్రకృతిని కాపాడుతాయి
అందంగా కనిపించే ఆరుద్ర పురుగును కొన్నిచోట్ల పట్టు పురుగు, చందమామ పురుగు , లేడీ బర్డ్ , ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ క్లాత్ తో చేసిన బొమ్మలా ఉంటాయి. ముట్టుకోగానే అత్తిపత్తి ఆకుల్లా ముడుచుకుపోతాయ్. ఇంగ్లీష్ లో Red Velvet Mite అని పిలిచే ఈ ఆరుద్ర పురుగులు పర్యావరణ నేస్తాలు.ఇవి నేలను గుల్లబారకుండా చేసి పంటలకు పోషకాలు అందిచడంలో సహకరిస్తాయి.
ఆరుద్ర కార్తె సామెతలు
ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు.
ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.
ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.
ఆరుద్రతో అదనుసరి.
ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.
ఆరుద్ర వాన ఆదాయాల బాన.
ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.
ఆరుద్ర వాన అరుదు వాన
ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి
విఘ్నేశ్వర స్వామి నామ స్మరణం
సమస్త సన్మంగళాని భవంతు.
శుభమస్తు.
తిరుమల మనోహర్ ఆచార్య
శ్రీ రామానుజ యాగ్నిక పీఠం దక్షిణభారతదేశ సహాయ కార్యదర్శి
హైదరాబాద్