రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు*
రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14/
తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం మంత్రి జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో రూ. 9 కోట్ల 82 లక్షల వ్యయంతో నిర్మించిన 156 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులచే గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నిజమైన పేదవారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, లబ్ధిదారుల ఒక్క పైసా ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా అందజేయాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం డబుల్ బెడ్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 18 వేల కోట్లతో 2 లక్షల 80 వేల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన అన్నారు. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లలాగా సురక్షితమైన త్రాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, పచ్చదనంతో అన్ని వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు మంత్రి అన్నారు. రాష్ట్రంలోని 62 లక్షల మంది రైతులకు రైతు బంధు క్రింద 52 వేల కోట్ల రూపాయలు వారి వారి ఖాతాల్లో జమచేసామన్నారు. కళ్యాణలక్ష్మి/షాదీముబారక్ క్రింద 8 వేల 5 వందల కోట్లు లబ్ధిదారులకు అందజేసామన్నారు. ఇప్పటికే 11 లక్షల కేసీఆర్ కిట్ల పంపిణీ చేశామన్నారు. రాష్ట్రాన్ని హరితమయం చేయడానికి తెలంగాణాకు హరితహారం పథకం చేపట్టి 270 కోట్ల మొక్కలు నాటామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవన్నారు. పేదవారికి మాట ఇస్తే, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాట తప్పదని ఆయన అన్నారు. ఇండ్లు రానివారికి విచారణ చేసి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రజాప్రతినిధుల పాత్ర లేకుండా, అధికారులకే అధికారం అప్పగించి, రాజకీయాలకతీతంగా నిజమైన పేదవారందరికి ఇండ్లు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, ప్యాకేజీ -9 ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాస రెడ్డి, జెడ్పీ సీఈఓ గౌతం రెడ్డి, ఆర్ & బి ఈఈ కిషన్ రావు, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ కె. కౌటిల్య, ఎంపీపీ శరత్ రావు, జెడ్పీటీసీ నర్సయ్య, ఎంపీడీఓ రమాదేవి, తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి, స్థానిక సర్పంచ్ సుమతి, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
