దౌల్తాబాద్: మండల సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో సాదాసీదాగా కొనసాగింది. అధికారులందరూ సర్వసభ్య సమావేశానికి విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆయా శాఖల ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో వైన్స్ లు రెండు ఒకే చోట ఉండటం వల్ల రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, అలాగే గ్రామాల్లో బెల్ట్ షాప్ లను అరికట్టాలని పలువురు సభ్యులు ఎక్సైజ్ శాఖ సిబ్బందికి సూచించారు. దౌల్తాబాద్, ఇందుప్రియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు నాగరాజు, అశ్లేష లు మాట్లాడుతూ రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 వ తేదీన ప్రారంభమై 100 రోజులపాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని, గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారన్నారు. ఐకెపి ఎపిఎం కిషన్ మాట్లాడుతూ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ రంగానికి సంబంధించిన వృత్తి విద్య కోర్సులను సిద్దిపేటలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. 18 నుండి 30 సంవత్సరాలలోపు నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, పీఎసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో రాజేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు, డిప్యూటీ తహాసిల్దార్ జహీర్ తదితరులు పాల్గొన్నారు….
