ప్రాంతీయం

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

12 Views

* పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కొత్తగా చేయూత పింఛన్ల మంజూరు* మంచిర్యాల జిల్లాలో 10 వేల 529 కొత్త పింఛన్లు
* రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద

నవంబర్ 17, 2026:
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి, పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. మంగళవారం జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌విఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మండల తహసిల్దార్ సతీష్, క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, డి.సి.సి. ప్రతినిధి రఘునాథ్, అధికారులతో కలిసి క్యాతన్‌పల్లి, మందమర్రి ప్రాంతాలకు చెందిన నూతన చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా *రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ* పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. గతంలో పింఛన్ల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూసిన అర్హులకు ప్రస్తుతం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి కొత్తగా పింఛన్ కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో నవంబర్ నెలకు సంబంధించి మొత్తం 10 వేల 529 కొత్త చేయూత పింఛన్లు మంజూరయ్యాయని, వీటి ద్వారా నెలకు 2 కోట్ల 53 లక్షల 42 వేల 464 లబ్ధిదారులకు పంపిణీ కానున్నాయని తెలిపారు. ఇందులో దివ్యాంగులకు 2 వేల 58, వితంతువులకు 6 వేల 532, చేనేత కార్మికులకు 22, గీత కార్మికులకు 325, ఒంటరి మహిళలకు 1 వేయి 592 పింఛన్లు మంజూరయ్యాయని, క్యాతన్‌పల్లి, మందమర్రి ప్రాంతాలకు చెందిన 1 వేయి 40 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగుల పింఛన్ల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే స్పందించి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు పొందేలా చర్యలు తీసుకొని అర్హులకు పింఛన్లు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో గత సంవత్సరం సుమారు 3 వేల 500 ఇళ్లు మంజూరు చేయగా మొత్తం 5 వేల 500 ఇండ్ల మంజూరుకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 1 వేయి 800 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి సందర్భంగా 2 లక్షల ఇండ్లను మంజూరు చేయడంతో పాటు, రాబోయే 3 సంవత్సరాలలో మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సహాయం అందించడం జరుగుతుందని,  అత్యవసర వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి, ఎల్.ఓ.సి. ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.

చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సుమారు 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశలలో కొనసాగుతున్నాయని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అమృత్ పథకం క్రింద చెన్నూర్ కు 30 కోట్ల రూపాయలు, క్యాతన్‌పల్లికి 40 కోట్ల రూపాయలు, మందమర్రికి 30 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. గ్రామీణ రహదారుల నిర్మాణానికి సుమారు 80 కోట్ల రూపాయలు, ఆర్ & బి రహదారుల అభివృద్ధికి 60 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. మందమర్రి ప్రాంతంలో సింగరేణి ఆధ్వర్యంలో 600 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి 60 లక్షల రూపాయలు, పాఠశాల రూఫ్ నిర్మాణానికి డిఎంఎఫ్‌టి నిధుల ద్వారా 30 లక్షల రూపాయలు కేటాయించి పనులు పూర్తి చేయడం జరిగిందని, మందమర్రిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించామని, సోమనపల్లిలో సుమారు 200 కోట్ల రూపాయలతో వసతి సౌకర్యాలతో కూడిన విద్యాసంస్థ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా యోజన ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులకు 5 లక్షల రూపాయల బీమా సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, పట్టణ ప్రాంతాలలో నేరుగా వివరాల నమోదు, గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా దరఖాస్తుల ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డులు లేని అర్హులైన కుటుంబాలకు కూడా పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

*జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన నూతన చేయూత పింఛన్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించిన వారికి అర్హత ఉంటుందని వివరించారు. ధ్రువీకరణ పత్రాలలో లోపాలు ఉన్నవారు సంబంధిత వైద్య నిపుణుల కమిటీని ఆశ్రయించి అప్పీల్ చేసుకోవాలని సూచించారు. 360 డిగ్రీల డేటా పరిశీలనలో అర్హులుగా గుర్తించినప్పటికీ సాంకేతిక కారణాలతో పింఛన్లు పొందని వారి వివరాలను సరిచేసి, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర అన్ని కేటగిరీలలో అర్హులైన వారికి పింఛన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలులో అర్హులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

అనంతరం కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్లను సందర్శించి లబ్ధిదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

అంతకుముందు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భోజనశాల నిర్మాణం పనులు పూర్తి అయినందున వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారంతో పాటు నాణ్యమైన విద్యా బోధన అందించాలని తెలిపారు.

* జిల్లాలోని జైపూర్ మండలం దుబ్బపల్లి రోడ్డులో గల పి.ఎల్.ఎన్.ఆర్. గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, జైపూర్ మండల తహసిల్దార్ వనజా రెడ్డి, జైపూర్ భీమారం మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు శ్రీపతి బాపు, వీణ లతో కలిసి లబ్ధిదారులకు చేయూత పింఛన్ పత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా *రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ* ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పనతో పాటు 10 వేల మంది ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం జరిగిందని, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి (స్కిల్ సెట్స్), అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, విదేశీ భాషల శిక్షణ ద్వారా ఉపాధి కల్పించినందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం దాదాపు ఇప్పటి వరకు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజా సంక్షేమంలో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను చేపట్టి, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంట్‌లో 1 వేయి 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి వచ్చిన అనంతరం స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని, రామకృష్ణాపూర్ ప్రాంతంలో కొత్త బొగ్గు గనిని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని, అటవీ అనుమతులు వచ్చిన వెంటనే తదుపరి పనులు ప్రారంభిస్తామని, గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు 70 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు చేపట్టాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చెన్నూర్ లో ఈ నెల 24, 25 తేదీలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందులో సుమారు 20 మంది వైద్యులు సేవలందించనున్నారని, కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ* నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో జైపూర్ మండలం పురోగతి బాగుందని, ఇప్పటికే ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి బిల్లులు పొందాలని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన నూతన చేయూత పింఛన్లను జైపూర్ మండలంలోని 509 మంది, భీమారం మండలంలోని 231 మంది అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబయ్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందని వారు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించి రసీదు పొందాలని సూచించారు. అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించగలిగిన సమస్యలను పరిష్కరిస్తామని, సాధ్యం కాని అంశాలకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేస్తామని వివరించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *