జిల్లాలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక డ్రైవ్ – జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
తెలుగు న్యూస్ మంచిర్యాల:
వేసవి కాలంలో ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో గ్రామీణ నీటి సరఫరా ఈ.ఈ. వెంకటేష్, మిషన్ భగీరథ ఈ.ఈ. మధుసూదన్ లతో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, డి.ఈ.లు, ఎ.ఈ.లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత త్రాగునీరు అందించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా త్రాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల పనితీరును మెరుగుపరచడంతో పాటు, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రిడ్, బల్క్ వాటర్ సప్లై పథకాల ద్వారా మున్సిపాలిటీలు, పట్టణ స్థానిక సంస్థలకు శుద్ధి చేసిన నీరు సక్రమంగా చేరేలా పర్యవేక్షించాలని, గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీ సురక్షిత త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయి తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తనిఖీ కార్యాచరణ ప్రకారం మండల స్థాయి బృందాలు అన్ని ఆవాసాలను సందర్శించి త్రాగునీటి సరఫరా పరిస్థితి, పైప్‌లైన్లలో లీకేజీలు, వాల్వ్‌ల పనితీరు, నీటి సరఫరా వ్యవస్థలోని లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని తెలిపారు. ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, గ్రౌండ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్లు, మ్యాన్‌హోల్స్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచడంతో పాటు, నీటి ట్యాంకులకు క్లోరినేషన్ నిర్వహించాలని, అవసరమైన మేరకు బ్లీచింగ్ పౌడర్ వినియోగించి త్రాగునీటి నాణ్యతను నిర్ధారించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆయా ప్రాంతాలలో ప్రత్యామ్నాయ నీటి వనరులు, సరఫరా మార్గాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాలలో త్రాగునీటి సమస్యలు ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు 1916 టోల్ ఫ్రీ నంబర్ గురించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్‌ను సమర్థవంతంగా అమలు చేసి, రానున్న వేసవి కాలంలో ప్రజలందరికీ సురక్షితమైన, నాణ్యమైన త్రాగునీటిని నిరంతరాయంగా అందించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





