ప్రాంతీయం

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

6 Views

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలుగు న్యూస్ మంచిర్యాల నవంబర్ 2, 2026:
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్ లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ కు చెందిన లింగంపల్లి లక్ష్మి తాను, తన భర్త వృద్ధులమని, తను దివ్యాంగురాలు అని, తన భర్త కూలీగా పనిచేసి పోషిస్తున్నాడని, రెండు పడక గదుల ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కన్నెపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన శివలి జగదీష్ తాను సమాచార హక్కు చట్టం క్రింద అడిగిన సమాచారాన్ని ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. మంచిర్యాల పట్టణానికి చెందిన లక్షెట్టి రాజమల్లు తనకు జి.ఓ. నం.59 క్రింద తన ఇంటి క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీశ్రీ నగర్ కు చెందిన జనగామ రాజబాబు తాను జి.ఓ. నం.59 క్రింద దరఖాస్తు చేసుకొని రుసుము కూడా చెల్లించడం జరిగిందని, పట్టా ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్ ఎస్.సి., ఎస్.టి. సబ్ ప్లాన్, ఇతర నిధులు సత్వరమే మంజూరు చేసి గ్రామంలోని కాలనీలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, గ్రామంలో శిథిలావస్థకు చేరిన జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలని కోరుతూ వేరువేరు దరఖాస్తులు అందజేశారు. మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జగ్గం బొందయ్య తనకు గ్రామ శివారులో గల భూమిలో కొందరు దౌర్జన్యంగా అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటూ విక్రయాలకు పాల్పడుతున్నారని, ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ప్రతినిధులు 3వ సమావేశాన్ని నిర్వహించి అర్హులైన పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 56 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం బీర్సాముండా 151 జయంతిని పురస్కరించుకుని గ్రామస్థాయిలో చేపట్టిన జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమాల సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు జన జాతీయ గౌరవ దివస్ లో భాగంగా గిరిజనుల చరిత్ర, వారసత్వం, స్వాతంత్ర పోరాటంలో పాత్ర, మౌలిక వసతులు కల్పన, చిత్రలేఖనం పోటీల నిర్వహణ, గిరిజన సంస్కృతి, స్వాతంత్ర సమరయోధులపై వ్యాసరచన, కథా రచన, కవితలు, క్విజ్ పోటీలు, చేతివృత్తులు, సంగీతం, నృత్యాలపై శిక్షణ శిబిరాలు, విద్య, పోషకాహారం, సంక్షేమ పథకాల అమలు, మొక్కలు నాటడం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, గిరిజన రంగాలలో ప్రతిభ చూపి ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *