ప్రాంతీయం

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

4 Views

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు.   తెలుగు న్యూస్ అక్టోబర్ 24, 2026:
గోదావరి పుష్కరాలు- 2027 లో భాగంగా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మండల తహసిల్దార్ రఫతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, జిల్లా దేవాదాయ అధికారి రవి లతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం దాదాపు 2 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసిందని, పుష్కర ఘాట్ల నిర్మాణం, ప్రధాన దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని తెలిపారు. బాసర ఆలయానికి 354 కోట్ల రూపాయలు కేటాయించగా, అందులో 324 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు కాగా, మిగిలిన సుమారు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో సమకూరనున్నాయని తెలిపారు. కాళేశ్వరం ఆలయానికి 198 కోట్ల రూపాయలు, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయానికి 276 కోట్ల రూపాయలు, ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ పనులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దేవాలయాల అభివృద్ధితో పాటు పుష్కర ఘాట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 1 వేయి కోట్ల రూపాయలు, ప్రధాన దేవాలయాల అభివృద్ధికి సుమారు 1 వేయి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, కందకుర్తి, మంథని తదితర ప్రాంతాలలోని ఆలయాలు, ఘాట్ల అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. దేవాలయాలలో ఇప్పటికే సుమారు 40 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను పుష్కరాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన పనులను కాంట్రాక్టర్లు ప్రారంభించారని, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు వారానికొకసారి సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని గూడెం గుట్ట ఆలయ అభివృద్ధికి 58 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అక్కడి రాతి నిర్మాణ పనుల కారణంగా కొన్ని పనులకు అదనపు సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, పుష్కరాల సమయంలో భక్తులకు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పుష్కర ఘాట్ల నిర్మాణానికి సంబంధించి తవ్వకం పనులు ప్రారంభమయ్యాయని, నీటిమట్టం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితులకు అనుగుణంగా పనులు చేపడతామని తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని తెలిపారు. పుష్కరాల సందర్భంగా టెంట్ సిటీలు, పార్కింగ్ స్థలాలు, త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. పోలీసు శాఖకు అవసరమైన బడ్జెట్ కేటాయించామని, ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహాల నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థలను వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలోని ప్రధాన ఘాట్ల వద్ద గోదావరి హారతి నిర్వహించడంతో పాటు భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. గోదావరి తీరంలోని 67 ఘాట్లకు కలిపి ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 5 నుంచి 6 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.  పుష్కరాల సమయంలో తాత్కాలిక వసతి, ఇతర సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోందని తెలిపారు. పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి తీరం వద్ద పుష్కర ఘాట్ ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం చెన్నూర్ పట్టణంలోని గోదావరి తీరం వద్ద కొనసాగుతున్న పుష్కర ఘాట్ పనులను జిల్లా కలెక్టర్, చెన్నూర్ తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ పెద్దింటి పద్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అజ్మత్ అలీ లతో కలిసి పరిశీలించారు. పుష్కర ఘాట్ ఏర్పాటు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని చెరువు వద్ద పర్యాటక ప్రాంత అభివృద్ధి అంశంపై పరిశీలించారు. పట్టణంలోని మదన పోచమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల, దేవాదాయ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *