అర్హత గల ప్రతి ఓటరు వివరాలు జాబితాలో ఉండాలి -జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని 2, 3, 18 వార్డులలో గల పోలింగ్ కేంద్రాలను మండల తహసిల్దార్ సతీష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 15, 16 తేదీలలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరిగిందని, వలస, డబుల్, మృతి చెందిన ఓటర్ల వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం జాబితా నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అర్హత గల ఓటర్ల వివరాలు తొలగించినట్లయితే సంబంధిత వ్యక్తుల నుండి ఫారం 6 ద్వారా దరఖాస్తు స్వీకరించి, వివరాలను పరిశీలించి జాబితాలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని అర్హత గల ఓటర్ల వివరాలు జాబితాలో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వలస, డబుల్, మృతి చెందిన వారి వివరాల తొలగింపునకు ఫారం 7 ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలోని దాదాపు 1 లక్ష 70 వేల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయగా 1 లక్ష 64 వేల మంది నుండి ధ్రువపత్రాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. జాబితాలో అర్హత గల ప్రతి ఒక్కరి వివరాలు ఉండాలని, అనర్హుల వివరాలు ఉండకూడదని తెలిపారు. ప్రత్యేక శిబిరాల తేదీలలో బూత్ స్థాయి అధికారులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారని, ఓటర్లకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉన్నట్లయితే సంప్రదించి పరిష్కరించుకోవాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు, నోటీసులకు సంబంధించి ధృవపత్రాలను అందించవచ్చని తెలిపారు. ముసాయిదా జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అంతకుముందు క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండలిని మండల తహసిల్దార్ తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మున్సిపాలిటీలు, గ్రామాలలో అవసరమైన లైటింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గామాత మండళ్ల ఏర్పాటులో భాగంగా అవసరమైన పోలీస్, రెవెన్యూ, విద్యుత్ సంబంధిత శాఖల అనుమతులు నిబంధనల ప్రకారం జారీ చేయడం జరిగిందని తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగను ప్రజలందరూ సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు.
అనంతరం బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 25, 12, 13 వార్డులలో గల పోలింగ్ కేంద్రాలను మండల తహసిల్దార్ కృష్ణ తో కలిసి సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





