పంటల కొనుగోలు ప్రక్రియకు లారీల యజమానులు సహకరించాలి-జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
తెలుగు న్యూస్ మంచిర్యాల అక్టోబర్ 16, 2026:
జిల్లాలో పత్తి, వరి తదితర పంటల కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు లారీల యజమానులు, జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. పంటల కొనుగోలు కేంద్రాల నుంచి పంటలను తరలించే రవాణా ప్రక్రియలో, కొనుగోలు కేంద్రాల వద్ద లారీలను అందుబాటులో ఉంచడం, అవసరమైన సమయంలో రవాణా సదుపాయాలు కల్పించడం వంటి అంశాలలో లారీల యజమానులు సహకరించాలని, పంటల కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పంటల కొనుగోలు, రవాణా ప్రక్రియలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియకు ఆటంకాలు కలిగించినట్లయితే సంబంధిత వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు వారి లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. పంటల కొనుగోలుకు అవసరమైన రవాణా సదుపాయాలను సమకూర్చే క్రమంలో, అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల నుంచి లారీలను జిల్లాలోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు, లారీల యజమానులు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





