క్షణాలను చరిత్రగా మలిచే కెమెరా కంటికి సెల్యూట్
ఫోటోగ్రఫీ దినోత్సవం… 
సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక వేడుకలు
ఎల్లారెడ్డిపేట:
ఒక క్షణాన్ని కెమెరాలో బంధిస్తే అది జ్ఞాపకంగా మిగులుతుంది.. అదే క్షణాన్ని ఓ నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో ఆవిష్కరిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి అద్భుతమైన కళకు ప్రతీకగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బుధవారం రోజున ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు జెండాను ఎగురవేసి ఫోటోగ్రాఫర్ల ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. అనంతరం లూయిస్ దాగ్యురే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరంఫోటోగ్రఫీ కళకు తమ గౌరవాన్ని చాటుకున్నారు. తధానంతరం ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం సభ్యులు మాట్లాడారు ఒకరికొకరు ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సమాజంలో జరిగే ప్రతి ముఖ్యమైన ఘటనకు ఫోటోగ్రాఫర్ల కెమెరా సాక్ష్యంగా నిలుస్తోంది. పుట్టినరోజు నుంచి వివాహం వరకు, పండుగల నుంచి ప్రజా ఉద్యమాల వరకు, ప్రకృతి అందాల నుంచి సామాజిక సమస్యల వరకు ఎన్నో జ్ఞాపకాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఫోటోగ్రాఫర్లు ప్రజలకు అందిస్తున్నారు. ముఖ్యంగా జర్నలిజంలో ఫోటోకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక మంచి చిత్రం కొన్నిసార్లు వందల పదాలు చెప్పలేని విషయాన్ని ఒక్క క్షణంలో ప్రజలకు అర్థమయ్యేలా చేస్తుంది.
కాలానుగుణంగా ఫోటోగ్రఫీ రంగంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఫిల్మ్ కెమెరాలతో ఫోటోలు తీసి, వాటిని ప్రాసెస్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం డిజిటల్ కెమెరాలు, డ్రోన్లు, స్మార్ట్‌ఫోన్ కెమెరాలు అందుబాటులోకి రావడంతో ఫోటోగ్రఫీ మరింత విస్తరించిందన్నారు అయినప్పటికీ పరికరం కంటే ఫోటోగ్రాఫర్ చూపు, సృజనాత్మకత, సమయస్ఫూర్తే మంచి చిత్రానికి అసలైన బలం.
ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1839 ఆగస్టు 19న డాగ్యురియోటైప్ ప్రక్రియను ప్రపంచానికి ప్రకటించిన చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, పెంజర్ల తిరుపతి యాదవ్, మండల అధ్యక్షులు అజముద్దీన్, సీనియర్ ఫోటోగ్రాఫర్ ఫక్రుద్దీన్, షాదుల్, షాడ చంద్రశేఖర్, పాలోజీ చక్రి, చారి, బంటి, శ్రీధర్, శివ, మండల ఫోటోగ్రాఫర్లు తదితరులు ఉన్నారు,
ఎల్లారెడ్డిపేటలో ఫోటోగ్రాఫర్లు నిర్వహించినఈ వేడుక ఫోటోగ్రఫీపై వారికున్న అభిమానం, వృత్తిపట్ల అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. కెమెరా కంటితో సమాజాన్ని చూసి, కాలాన్ని చిత్రంగా భద్రపరుస్తున్న ప్రతి ఫోటోగ్రాఫర్‌కు ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు.





