రామగుండం పోలీస్ కమిషనరేట్
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు,గోదావరి ఘాట్‌ను పరిశీలించిన గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ శ్రీ ఎం.రమేష్, రామగుండం సీఐ శ్రీ కృష్ణ కుమార్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఇంద్రసేన రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి,ప్రస్తుతం నీటి ప్రవాహ పరిస్థితులు,ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణం తదితర వివరాలను పరిశీలించారు.
ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నందున,దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం సమ్మక్క దేవాలయం సమీపంలోని గోదావరి వంతెన వద్ద ఉన్న గోదావరి ఘాట్‌ను సందర్శించి,ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి విడుదలవుతున్న నీటి ప్రవాహ పరిస్థితులను పరిశీలించారు.ఈ సందర్భంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, నదీతీర ప్రాంతాలకు వెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, అవసరం లేకుండా నదిలోకి దిగడం, చేపల వేటకు వెళ్లడం, సెల్ఫీలు తీసుకునేందుకు నది ఒడ్డుకు చేరుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో రామగుండం ఎస్‌ఐ శ్రీమతి సంధ్యారాణి, అంతర్గాం ఎస్‌ఐ శ్రీ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.





