*మంచిర్యాల జిల్లా*
ప్రమాద ప్రాంతాలలో ప్రజల రాకపోకలను నియంత్రించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య
జూలై 30, 2026:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదులు, కల్వర్టులు ఇతర ప్రమాద ప్రాంతాల వద్దకు ప్రజలు రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండలం టేకుమట్ల గ్రామపంచాయతీ పరిధిలోని వాగు ప్రవాహాన్ని, శిథిలావస్థలో ఉన్న మండల ప్రాథమికోన్నత పాఠశాలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న వర్ష పరిస్థితుల దృష్ట్యా ప్రజా సంక్షేమ, రక్షణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వాగు ఉధృతి పెరిగిన సందర్భంలో ప్రజలు ఎత్తి పరిస్థితులలోనూ వాగును దాటకుండా అవసరమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాగ్రత్త చర్యలలో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వాగు వద్ద ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా పంచాయతీ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల భవనం ప్రస్తుత స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాల విషయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల భవనం పరిస్థితిపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపు, సి.ఐ. నవీన్ కుమార్, ఎస్.ఐ. భూమేష్, పంచాయతీ కార్యదర్శి టి.శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





