అధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,ఏప్రిల్ 29, 2026:
జిల్లాలో వ్యవసాయ సాగులో అధిక పంట దిగుబడి సాధించేందుకు రైతులు మెలకువలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సన్నరకం వడ్ల సాగుపై రైతులు దృష్టి సారించేలా అధికారులు ప్రోత్సహించాలని తెలిపారు. రైతులకు పంట సాగులో అవసరమైన మెలకువలు, సూచనలు అందించాలని, నాణ్యమైన పంట దిగుబడి సాధించేలా కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ అందిస్తున్నందున రైతులకు ఆర్థిక లాభం చేకూరేలా వచ్చే వానాకాలం సీజన్ లో సన్న రకం వడ్లను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లాలో దాదాపు 1 లక్ష 57 లక్షల ఎకరాలలో అంచనా పంట సాగు విస్తీర్ణం గుర్తించడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు రైతులు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకువచ్చినట్లైతే ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అవసరమైన ప్యాడి క్లీనర్లు, కొనుగోలు కేంద్రాలలో తూకం యంత్రాలు, రైతులకు త్రాగునీరు, నీడ ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులకు లబ్ధి చేకూరేలా పంట సాగు చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





