*రామగుండం పోలీస్ కమిషనరేట్*
పరీక్షల పట్ల ఆందోళన వద్దు–ధైర్యంగా ఉండండి.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు.
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులకు పెన్నులు,చాక్లెట్లు పంపిణీ.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చెన్నూర్ సీఐ మరియు కోటపల్లి ఎస్సై.
విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి మరియు పోలీసుల పట్ల నమ్మకాన్ని బలపరిచే దిశగా పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. కృష్ణ, కోటపల్లి ఎస్సై రాజశేఖర్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.సోమవారం కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌ను వారు సందర్శించి, విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా సీఐ కృష్ణ విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడి, విద్య యొక్క ప్రాముఖ్యత మరియు క్రమశిక్షణ గురించి వివరించారు.ముఖ్యంగా పరీక్షా ఫలితాల సమయంలో విద్యార్థులు అనవసర ఆందోళనకు గురై ఆత్మహత్యల వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు.ఓటమిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. హాస్టల్‌లో అందుతున్న భోజన సౌకర్యాలను స్వయంగా పరిశీలించిన అధికారులు, విద్యార్థినులతో సమానంగా కూర్చుని వారితో కలిసి భోజనం చేశారు. “విద్యార్థులతో కలిసి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉంది.వారిలోని ఉత్సాహాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది” అని సీఐ కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.అనంతరం విద్యార్థినులకు పెన్నులు మరియు చాక్లెట్లు పంపిణీ చేశారు.
*పోలీస్ భరోసా – అందుబాటులో మహిళా కానిస్టేబుళ్లు*
విద్యార్థినులకు ఎలాంటి సమస్య ఎదురైనా,ఆపదలో ఉన్నా తక్షణమే పోలీసులను సంప్రదించాలని సూచించారు. వారికి భరోసా కల్పిస్తూ మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల ఫోన్ నంబర్లను అందజేశారు.ఏ సమయంలోనైనా తమను సంప్రదించవచ్చని, పోలీసులు ఎల్లప్పుడూ మీకు అక్కలాగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్సై రాజశేఖర్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, మహిళా కానిస్టేబుళ్లు మౌనిక,దీక్షిత, కానిస్టేబుల్ శ్రవణ్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.





