
ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసుకోవాలి
కలెక్టర్ గరిమ అగ్రవాల్
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో హౌసింగ్ మోడల్ హౌస్, గుండారంలో పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హౌసింగ్ మోడల్ హౌస్ ను కలెక్టర్ గరిమ అగ్రవాల్,అధికారులతో కలిసి బుధవారం ప్రారంభించారు.అనంతరం ఇందిరమ్మ ఇండ్ల కింద ఎంపిక చేసిన పైలెట్ గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం గుండారానికి చెందిన సిద్ధాల అఖిల, కంకణాల శ్రీలత,ఇందిరాల మమత,లకావత్ సునీత ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికారులు,ప్రజాప్రతి నిధులతో కలిసి పండుగ వాతావరణంలో ప్రారంభించారు.గృహ ప్రవేశం చేసి, లబ్ధిదారుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫిల్లర్ రూఫింగ్ తో ఖర్చు ఆదా
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వ తేదీ వరకు వివిధ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.10 శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు.హౌసింగ్ శాఖ ఆద్వర్యంలో నిర్మించిన మోడల్ హౌస్ లో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు తగ్గించేందుకు,స్లాబ్ నిర్మాణ ఖర్చు తగ్గించేందుకు ఫిల్లర్ రూఫింగ్ విధానంలో పూర్తి చేయడాన్ని చూసి అభినందించారు.రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం మంజూరు చేస్తుందని వెల్లడించారు.ప్రభుత్వం సూచించిన ధరలోనే ఇండ్లను నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని,లబ్ధిదారులకు అన్ని రకాల సామగ్రి, పనివారు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఇప్పటిదాకా 777 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం,హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు,డీఈ సాజిద్, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం,తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, ఎంపీఓ రాజు,కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి,సద్ది లక్ష్మారెడ్డి, దొమ్మాట నరసయ్య,తదితరులు పాల్గొన్నారు.





