జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 11, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జిల్లాలోని 1 మున్సిపల్ కార్పొరేషన్, 4 మున్సిపాలిటీలలో నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా మున్సిపాలిటీలలో కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని రామకృష్ణాపూర్ ప్రాంతంలో గల అల్ఫోన్జా ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టడం జరిగిందని, ఈ క్రమంలో అర్హులైన ఓటర్లు నిర్ణీత సమయంలోగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా బూత్ స్థాయి ఏజెంట్లు కృషి చేయాలని సూచించారు. సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం గేటు మూసివేసి, లోపల ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను 265 పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు గాను 68 పోలింగ్ కేంద్రాలు, చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకు గాను 36 పోలింగ్ కేంద్రాలు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు 45 పోలింగ్ కేంద్రాలు, లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కొరకు జోనల్, నోడల్ అధికారులు, పి.ఓ.లు, ఎ.పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు, వీడియో, స్టాటిస్టిక్ సర్వేయలెన్స్ బృందాలు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెల్, ఇతర ఎన్నికల సంబంధిత సిబ్బందిని నియమించి, అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ప్రజలకు అవసరమైన త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





