రామగుండం పోలీస్ కమిషనరేట్
*ఒక నిర్లక్ష్యపు చర్య… జీవితాంతం బాధ మిగిలిస్తుంది*
*ప్రమాదాల నివారణకు అందరం కలిసి పనిచేద్దాం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కలిసి పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్–అలైవ్” కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో, మంచిర్యాల డీసీపీ శ్రీ ఎగ్గడి భాస్కర్ అధ్యక్షతన మీడియా అవుట్‌రీచ్ డే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అరైవ్–అలైవ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, వాహనదారులు ఇంటి నుంచి బయలుదేరి సురక్షితంగా గమ్యాన్ని చేరి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకోవాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటించడం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా సమాజానికి సంబంధించిన అంశమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.
హెల్మెట్ ప్రాముఖ్యత అందరికీ తెలిసినప్పటికీ, దాన్ని ధరించకపోవడమే అనేక ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు శాశ్వత అంగవైకల్యంతో జీవితాంతం బాధపడాల్సి వస్తోందన్నారు. ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశాలను కమిటీ సభ్యులు పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించి, ఆ ప్రాంతంలో మళ్లీ ప్రమాదాలు జరగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్‌లో వెళ్లడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అతివేగం వంటి చర్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయని హెచ్చరించారు.
ప్రమాదాల రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు మూడు విధానాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అవి 1. ఇంజనీరింగ్, 2. ఎడ్యుకేషన్ (అవగాహన), 3. ఎన్ఫోర్స్‌మెంట్ (కఠిన అమలు) అని వివరించారు.
సమాజంలోని మారుమూల ప్రాంతాల వరకు సమాచారాన్ని చేరవేసే శక్తి మీడియాకు ఉన్నందున, పోలీస్ శాఖతో సమన్వయంతో మీడియా రోడ్డు భద్రత సందేశాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సీపీ కోరారు. అందరం కలిసి“అరైవ్–అలైవ్” లక్ష్యంగా ప్రమాదాల నివారణ,సురక్షిత ప్రయాణం, క్షేమంగా గమ్యం చేరే వాతావరణాన్ని ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం అధికారులు కలిసి అరైవ్–అలైవ్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐలు ప్రమోద్ రావు, అశోక్, శ్రీలత,నరేష్ కుమార్,ఎస్సైలు పాల్గొన్నారు.





