నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి.
మంచిర్యాల జిల్లా.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆదేశాలమేరకు, జిల్లా విద్యార్థి విభాగం, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో, మంచిర్యాల జిల్లా లైబ్రరీలోని నిరుద్యోగులు, విద్యార్థులతో కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి దిశానిర్దేశం చేయడం జరిగింది.
సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు దీపక్ కుమార్, మహేష్ లు మాట్లాడుతూ..
నిరుద్యోగం, విద్యా వ్యవస్థ పతనం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నోటిఫికేషన్లు ప్రకటించకుండా మాట తప్పడం ద్వారా యువతను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాల్లో కలిసిపోయాయని, జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఖాళీ పోస్టుల భర్తీకి స్పష్టమైన టైమ్‌లైన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా నాయకులు పాకాల దినకర్, శివతేజ లు మాట్లాడుతూ
నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం బహుజనుల రాజ్యాధికారమే అని స్పష్టంగా పేర్కొన్నారు. అధికారం కొద్దిమందికి కాకుండా బహుజనులకు దక్కినప్పుడే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. త్వరలోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ అధ్యక్షతన పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, తీన్మార్ మల్లన్న ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, మన రాజ్యాధికారం సాకారం అవుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు సిపతి సాయి కుమార్, జిల్లా నాయకులు , కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





