కథనాలు

చదువుతో చీకటిని చీల్చిన విప్లవ జ్యోతి – సావిత్రిబాయి పూలే జయంతి.

19 Views

భారతదేశ సామాజిక చరిత్రలో కొన్ని పేర్లు మాత్రమే యుగాలను మార్చాయి. అలాంటి అరుదైన పేర్లలో ముందుగా గుర్తొచ్చేది సావిత్రి భాయి పూలే. ఆమె జయంతి అంటే ఒక వ్యక్తిని స్మరించుకోవడం మాత్రమే కాదు. చదువు సమానత్వం, మానవ గౌరవం కోసం జరిగిన మహత్తర పోరాటాన్ని గుర్తు చేసుకునే సందర్భం. ఈ రోజుల్లో మహిళా విద్య సాధారణంగా కనిపిస్తోంది. కానీ ఒక శతాబ్దం క్రితం పరిస్థితి భిన్నంగా ఉండేది. మహిళలు చదువుకోవడం పాపమని, సంప్రదాయాలకు విరుద్ధమని భావించిన సమాజంలో, ఒక మహిళ చదువు నేర్పేందుకు ముందుకు రావడం అంటే అగ్నిపరీక్షను ఎదుర్కోవడమే. అలాంటి అగ్నిపరీక్షను నవ్వుతూ ఎదుర్కొన్న ధైర్యవంతురాలు సావిత్రి భాయి పూలే. అప్పటి సమాజంలో మహిళల జీవితం నాలుగు గోడల మధ్యే పరిమితం. చదువు అనే మాట వారి జీవితాల్లో లేనే లేదు. ఆడపిల్ల పుట్టిందంటే భారం అన్న భావన బలంగా ఉండేది. ఈ ఆలోచనల మధ్యే సావిత్రి భాయి పూలే చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. చదువుతోనే కాదు, చదువు ద్వారా సమాజం మారుతుందని నమ్మారు. భర్త జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించారు. ఇది అప్పటి సమాజానికి ఒక పెద్ద సవాలు. పాఠశాలకు వెళ్లే దారిలో ఆమెపై చెత్త వేయడం, రాళ్లు విసరడం, దూషించడం సాధారణమయ్యాయి. కానీ ఆమె ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గలేదు. రోజుకు రెండు చీరలు తీసుకెళ్లి, మురికైన చీరను మార్చుకుని తిరిగి బోధన కొనసాగించేవారు. ఇది ఆమె అంకితభావానికి నిదర్శనం. సావిత్రి భాయి పూలేకు చదువు అంటే ఉద్యోగం కోసం కాదు. చదువు అంటే ఆలోచించే శక్తి, ప్రశ్నించే ధైర్యం, స్వేచ్ఛగా జీవించే హక్కు. మహిళ చదువుకుంటే ఆమె మాత్రమే కాదు, ఆమె కుటుంబం, ఆమె పిల్లలు, చివరికి సమాజం మొత్తం ఎదుగుతుందన్న స్పష్టత ఆమెకు ఉంది. ఆమె సేవలు మహిళా విద్యకే పరిమితం కాలేదు. అణగారిన వర్గాల పిల్లలకు విద్య అందించేందుకు శ్రమించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా నిలబడ్డారు. బాల్యవివాహాల వల్ల నాశనం అవుతున్న బాలికల జీవితాల కోసం పోరాడారు. వితంతువుల పునర్వివాహానికి మద్దతుగా నిలిచి, సమాజం త్రోసిపుచ్చిన మహిళలకు ఆశ్రయం కల్పించారు. అంటువ్యాధులు ప్రబలిన సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించడం ఆమె మానవత్వానికి మరో ఉదాహరణ. సమాజం దూరంగా పెట్టిన వారిని దగ్గరకు తీసుకోవడమే నిజమైన సంస్కారం అన్న భావన ఆమె జీవితం ద్వారా స్పష్టమవుతుంది. ఈ రోజుల్లో మహిళలు ఉన్నత విద్య చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. ఆ మార్గంలో తొలి అడుగు వేసింది సావిత్రి భాయి పూలే. ఆమె లేకపోతే మహిళా విద్య ఉద్యమం మరింత ఆలస్యం అయ్యేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే నేటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారు. పేదరికం, సంప్రదాయాలు, బాల్యవివాహాలు, భద్రతా సమస్యలు ఇంకా అడ్డంకులుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సావిత్రి భాయి పూలే జీవితం మనందరికీ ఒక ప్రశ్న వేస్తుంది. “మనం నిజంగా చదువును అందరికీ చేరువ చేస్తున్నామా..? ”సావిత్రి భాయి పూలే జయంతిని పూలమాలలు, ఫోటోలకే పరిమితం చేయడం సరిపోదు. ప్రతి అమ్మాయి చదువుకోవాలన్న సంకల్పం తీసుకోవాలి. చదువుతోనే సమానత్వం వస్తుంది. సమానత్వంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. సావిత్రి భాయి పూలే చూపిన దారి ఈ రోజుకీ మార్గదర్శకం. చదువు ద్వారా చైతన్యం, చైతన్యం ద్వారా సమాజ మార్పు – ఇదే ఆమె అందించిన గొప్ప సందేశం. ఆమె జీవితం ఒక చరిత్ర కాదు. మనందరికీ ఒక బాధ్యత… నేడు జనవరి 3 తేదీన సావిత్రి భాయి పూలే జయంతి పురస్కరించుకొని ఘన నివాళి అర్పిస్తున్నాం…

పుట్ట రాజు, రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు 9502117400.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *