మందమర్రి లో సీసీ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం.
మంచిర్యాల జిల్లా
మందమర్రి, డిసెంబర్ : కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గురువారం మందమర్రి పట్టణంలో సీసీ రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మరియు ఇతర అధికారులతో పాటు రోడ్డు పనులకు భూమి పూజలో పాల్గొన్నారు మంత్రి వర్యులు. ఈ ప్రాజెక్టులో భాగంగా భగత్ సింగ్ నగర్ నుంచి శ్రీపతినగర్ వరకు కొత్త సీసీ రోడ్డును నిర్మించనున్నారు.
దీనివల్ల పట్టణంలో రవాణా సౌకర్యం మెరుగుపడి, స్థానిక ప్రజలకు గణనీయమైన ఉపశమనం కలగనుంది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో మందమర్రిలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయని తను చెప్పారు. చెన్నూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటివరకు సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
పట్టణ, గ్రామ ప్రాంతాల తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.





