సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) యూనిట్–1, యూనిట్–2 సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వర్షాకాల శిబిరం దొమ్మాట, గాజులపల్లిలో వారం రోజులపాటు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ మంగతా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో నెలకొన్న సామాజిక సమస్యలను, రుగ్మతలను లోతుగా అవగాహన చేసుకుని, భవిష్యత్తులో వాటి నివారణకు చైతన్యవంతులుగా ముందుకు సాగాలని సూచించారు. యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ యువత సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదిగి, సేవా భావంతో నిస్వార్థంగా అంకితమవ్వాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ముగింపు కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ ఆటపాటలతో చైతన్యం నింపగా, శిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ పెద్దలు, స్థానిక యువత, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం మరింత ప్రతిష్ఠాత్మకంగా సాగింది.





