స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ సర్పంచ్ రాములు గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చెబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, ఇప్పల గూడెం బిఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డితో కలిసి అంగడి కిష్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బబ్బూరి రాములు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికలను వాయిదా వేయడం వల్ల గ్రామ స్థాయిలో అభివృద్ధి నిలిచిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు తగిన హక్కులు, స్థానిక సమస్యల పరిష్కారం లభించాలంటే ఎన్నికలు తప్పనిసరిగా జరగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ దీనివల్ల సామాజిక న్యాయం మరింత బలపడుతుందని రాములు గౌడ్ అభిప్రాయపడ్డారు. కోర్టులో కేసులు అనుకుంటూ జాప్యం చేయడం వల్ల అభివృద్ధికి పల్లెలు దూరమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా రాకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామాల్లో ట్రాక్టర్ల బకాయిలు కట్టలేని పరిస్థితుల్లో గ్రామపంచాయతీలో ఉన్నాయని దేశానికి పట్టుకొమ్మల్లో ఉన్న గ్రామపంచాయతీలను వెన్ను విరవడం మంచి పద్ధతి కాదన్నారు.





