ఎస్‌బీఐ చెన్నూర్‌లో భారీ మోసం: ₹12.61 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరణ; 44 మంది అరెస్ట్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చెన్నూర్ బ్రాంచ్‌లో జరిగిన భారీ గోల్డ్ లోన్ మరియు నగదు మోసం కేసును రామగుండం పోలీస్ కమిషనరేట్ ఛేదించింది. ఇందులో బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్‌తో సహా మొత్తం 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
2025 ఆగస్టు 23న, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో 402 గోల్డ్ లోన్ ఖాతాలకు చెందిన ₹12.61 కోట్ల విలువైన 25.17 కిలోల బంగారం, మరియు ₹1.10 కోట్ల నగదు అపహరణకు గురయ్యాయి. ఫిర్యాదు అందిన వెంటనే రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, డీసీపీ మంచిర్యాల్ ఏ. భాస్కర్ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఏసీపీ జైపూర్ ఏ. వెంకటేశ్వర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
