మహబూబాబాద్ జిల్లా/తొర్రూరు మండల తెలుగున్యూస్24/7 ఫిబ్రవరి 09/
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్న టిఆర్ఎస్ శ్రేణులు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో పాలకుర్తి నియోజకవర్గంలో నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల మండల కేంద్రాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా బైక్ ర్యాలీలలో పాల్గొని ధర్నా నిర్వహించారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణపై దాడికి బీజేపీ కుట్ర చేస్తున్నదన్నారు. ప్రధాని నిన్న రాజ్యసభలో తెలంగాణ విభజనపై విషం కక్కారని చెప్పారు. తెలంగాణను కానీ, తెలంగాణ సీఎం కెసీఆర్ ను కానీ ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ బిడ్డలు చాలా చైతన్యవంతులన్న విషయం గుర్తు చేశారు. రాజ్యాంగ బద్దంగా విభజన జరిగిందని, తెలంగాణ విభజనను వ్యతిరేకించినా, కించపరిచినా రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, కించపరచడమేనని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.





