గూడూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆల్ ఇండియా తన్జీమ్ ఏ ఇన్సాఫ్, సీపీఐ ఆధ్వర్యంలో హవీల్దార్, పరమవీరచక్ర అబ్దుల్ హమీద్ వర్థంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ, ఇన్సాఫ్ నాయకులు హాజరయ్యారు. తొలుత కమాండర్ అబ్దుల్ హమీద్ చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి గౌరవాధ్యక్షులు షేక్ కాలేషా మాట్లాడుతూ 1965లో ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులపై వీరోచితంగా పోరాడి అమరుడయ్యారన్నారు. యువత హమీద్ థైర్య సాహసాలను పుణికి పుచ్చుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ 1965 సెప్టెంబర్ 9వ తేదీన జమ్మూకాశ్మీర్ ప్రాంతంలోని ఖేమ్ కరణ్ రోడ్డు చీమా ప్రాంతంలో తక్కువ స్థాయిలో భారత సైనికులున్న విషయాన్ని తెలుసుకున్న పాకిస్తాన్ సైనికులు భారీగా యుద్ధ ట్యాంకర్లతో మోహరించారన్నారు. ఆ సమయంలో అబ్దుల్ హమీద్ ఎంతో థైర్యంగా పోరాడి రెండు రోజుల వ్యవధిలోనే ఏడు యుద్ధ ట్యాంకర్లను పేల్చివేశాడన్నారు. పాకిస్తాన్ సైన్యాన్ని ముప్పుతిప్పలకు గురిచేశాడన్నారు. చివరికి పాకిస్తాన్ సైనికుల మెషిన్ గన్ల ధాటికి వీరోచితంగా పోరాడి అమరుడయ్యాడన్నారు. ఏంతోమంది ముస్లిం మైనారిటీలు దేశం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించారన్నారు. కానీ నేడు దేశంలో మత మారణహోమం పెచ్చుమీరిపోతోందన్నారు. ఈ తరం పాలకులు కుల, మతాలకు అతీతంగా పరిపాలన సాగించి అన్ని వర్గాల ప్రజలను సమాన దృష్టితో చూసినప్పుడే హవీల్దార్ అబ్దుల్ హమీద్ వంటి అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయన్నారు. ఆయన సేవలను గుర్తించి అత్యున్నత పురస్కారం పరమవీరచక్ర అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సీహెచ్. ప్రభాకర్, జీ. శశి కుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎంబేటి చంద్రయ్య, కె. నారాయణ, చల్లా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
