ప్రాంతీయం

మంచిర్యాలలో ఘనంగా మండల దివాస్ వేడుకలు

39 Views

*మండల్ కమిషన్ సిఫారసులను పూర్తిగా అమలు చేయాలి!*

*మంచిర్యాలలో ఘనంగా మండల్ దివస్ వేడుకలు*

మండల్ కమీషన్ సిఫారసులను సంపూర్ణంగా అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ జనాభా లెక్కలు సేకరించాలని వివిధ బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం రోజున మంచిర్యాలలోని బీసీ భవన్ లో జరిగిన మండల్ దివస్ వేడుకలలో వారు పాల్గొని ప్రసంగించారు. 1990వ సంవత్సరం ఆగస్టు 7న నాటి విశ్వనాధ్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నదని వారు తెలిపారు. ఈ దేశంలోని మెజార్టీ వర్గాల ఆత్మాభిమాన దినంగా మండల్ దివస్ నిలిచిపోనున్నదని వారు తెలిపారు. దేశ జనాభాలో మెజారిటీ వర్గంగా ఉన్న బీసీల జనాభా లెక్కలు తేలితేనే.. రిజర్వేషన్లు, ఇతర సంక్షేమ ఫలాలు సరిగ్గా అందుతాయని వారు పేర్కొన్నారు. విదేశీ పరిపాలనలో 1931లో చివరిసారి బీసీల లెక్కలు తీయగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ప్రభుత్వాలు బీసీ ల లెక్కల గురించి పట్టించుకోకపోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటు సాక్షిగా బీసీ జన గణన చేపడతామని హామీనిచ్చి అగ్రవర్ణాల ఒత్తిళ్లకు తలొగ్గి బీసీలకు అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. బీహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టి రిజర్వేషన్లను పెంచితే అగ్రవర్ణ దురహంకారులు కోర్టుకెక్కి నిలుపుదల చేయించారని వారు తెలిపారు. బీసీ జనగణన కేంద్రమే చేపట్టాలని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పిందని వారు గుర్తు చేశారు. మండల్ కమిషన్ సూచించిన మిగతా సిఫారసులను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని వారు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని బీసీ వర్గాల ప్రజలు ఐక్యంగా న్యాయమైన ఆకాంక్షల సాధనకు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, గాండ్ల తిలకేశ్వర సంఘం జిల్లా అధ్యక్షులు బుద్ధి చంద్రమౌళి, అర్కాల ఓదెలు, పద్మశాలి సంఘం నాయకులు బండి రాజలింగు, వేముల మల్లేశం, ఆవిడపు గణేష్ ,అడిచర్ల రాజయ్య, బొద్దున రాజేశం, గుంటుక సోమన్న, అఖిల్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్