మంచిర్యాల జిల్లా
మంచిర్యాల నియోజక వర్గంలోని ప్రజలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం కాలేజ్ రోడ్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి మరియు హాజిపూర్ మండలం గుడిపేటలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజి పనులను పరిశీలించారు.
ఈసందర్భంగా ఎమెల్యే మాట్లాడుతూ, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్నానని తెలిపారు. అందులో భాగంగా మంచిర్యాల లో వైద్య రంగంకు ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు. మార్కెట్ కార్యాలయంలో నిర్మిస్తున్న ఆసుపత్రి వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని అన్నారు. అనంతరం 350 పడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఐబీ స్థలంలో మాతా, శిశు ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రిలో పడకలు పెంచడం వల్ల భవిష్యత్తు లో పీజీ మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ధీంతో మంచిర్యాల లో మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఉన్నత విద్య స్థానికంగా అందించడానికి కృషి చేస్తానని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.
