ఎన్ఎస్ యూఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ జుబేర్
ఎల్లారెడ్డిపేట : సమాజ పునర్నిర్మాణంలో భావిభారత పౌరులైన విద్యార్థుల పాత్ర ఎంతో కీలకం.. కానీ అలాంటి విద్యార్థులు నేడు కొంతమంది అధ్యాపకుల కాసుల కక్కుర్తిలో వారి ఉజ్వల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ కు ముందు ఒక మాట అడ్మిషన్ అయ్యాక మరో మాట మాట్లాడుతూ ఫీజుల పేరిట వేధింపులకు గురిచేస్తూ మానసిక సంఘర్షణలో విద్యార్థులు సతమతం అయ్యేలా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఎన్ఎస్ యూఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సయ్యద్ జుబేర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జుబేర్ మాట్లాడుతూ రాచర్ల జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ యజమాన్యం అడ్మిషన్ సమయంలో ఒక మాట అడ్మిషన్ అయిన తర్వాత మరో మాట మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన దళిత విద్యార్థి మల్యాల రాములు కుమారుడు అమర్ ఎస్సీ స్కాలర్షిప్ తో ఇంటర్ చదువు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పూర్తి చేయిస్తామని చెప్పి పూర్తయిన తర్వాత స్కాలర్షిప్ రాలేదు, 10,500 రూపాయలు కట్టాలని వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే ఇంటర్మీడియట్ కు సంబంధించిన సర్టిఫికెట్లు ఇస్తామని రాచర్ల జూనియర్ కళాశాల యజమాని రాజయ్య ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీఏ కౌన్సెలింగ్ కు బుధవారం 12- 10- 22 నాడు చివరి తేదీ ఉంది అని చెప్పిన వినిపించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు రాచర్ల జూనియర్ కళాశాల యజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకుని సర్టిఫికెట్లు ఇప్పించాలని జుబేర్ డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులకు రాచర్ల జూనియర్ కళాశాల యజమాన్యంపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఇట్టి విషయమై కళాశాల కరస్పాండెంట్ ఏలూరి రాజయ్యను చరావని ద్వారా వివరణ కోరగా, సదరు విద్యార్ధి స్కాలర్షిప్ కొరకు అప్లయ్ చేసుకోలేదని, అదేవిధంగా రెండు సంవత్సరాల నుండి ఎలాంటి ఫీజు చెల్లించలేదని పేర్కొన్నారు.
