ప్రాంతీయం

ప్రశ్నించే గొంతుకలకు ప్రతిరూపం మానుకోట

154 Views

మహబూబాబాద్:సెప్టెంబర్ 30
24/7 తెలుగు న్యూస్

తమ అక్షరాలతో సమాజానికి ఉత్తేజం కలిగించిన అక్షరయోధులు షోయేబుల్లా ఖాన్, దాశరథిల పురిటిగడ్డ మానుకోట (మహబూబాబాద్) నాటి నుండి నేటివరకు ప్రశ్నించే గొంతుకలకు ప్రతిరూపంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు.

శనివారం నాడు మరిపెడ లో జరిగిన
టీయుడబ్ల్యూజే మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ అభినందన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

నాడు నిజాం నియంతృత్వ పోకడలను ఇమ్రోజ్, తేజ్ పత్రికల్లో నిర్భయంగా బహిర్గతం చేసి, రజాకార్ల చేతుల్లో తన ప్రాణాన్ని పావురం వలె ఎగరేసిన ఆదర్శ పాత్రికేయుడు, త్యాగశీలి షోయేబుల్లా ఖాన్ ఈ జిల్లా ముద్దుబిడ్డ కావడం ఈ ప్రాంత వాసులకు ఎంతో గర్వకారణమని విరాహత్ అలీ అన్నారు. అలాగే తన రచనలతో సమాజాన్ని మేల్కొల్పి చరిత్రకెక్కిన సుప్రసిద్ధ కవి, రచయిత దాశరథి రంగాచార్యులు మానుకోట మట్టివాసనలో పురుడు పోసుకుని ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారని ఆయన కొనియాడారు. ఆ మహనీయుల వారసత్వంతోనే తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, వారి ఆశయ సాధనకై కృషి చేయాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రాంత జర్నలిస్టులపై వుంటుందన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, మీడియా స్వేచ్చ పరిరక్షణ కోసం తమ సంఘం అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 65ఏండ్ల వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ చరిత్ర కలిగివున్న ఏపీయుడబ్ల్యుజె నుండి పుచ్చుకున్న వారసత్వంతో హక్కుల సాధనకై టీయూడబ్ల్యూజే రాజీలేని పోరాటాలు చేస్తుందని విరాహత్ చెప్పారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు నిబద్ధత, అంకింతాభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ, పవిత్రమైన జర్నలిజం విలువలను పరిరక్షించాలని సూచించారు. ఐజేయూ మాజీ కార్యదర్శి దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు రాజీలేని పోరాటాలతో తమ సంఘం జర్నలిస్టుల పక్షపాతిగా నిలిచిందన్నారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిత్తనురి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ నవీన్ రావు, సామాజిక కార్యకర్త భూపాల్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి గాడిపల్లి మధు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుంటి విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, జాతీయ కౌన్సిల్ సభ్యుడు దూలం శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండి సంపత్, మాజీ కార్యదర్శి యుగంధర్, సీనియర్ జర్నలిస్ట్ దొంతు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *