Breaking News

తెలంగాణ విముక్తి పోలో ఎలా ప్రారంభమైంది

148 Views

తెలంగాణ విముక్తి కోసం 1948 సెప్టెంబర్ 13 నుంచి ఆపరేషన్ పోలో ఎలా ప్రారంభమైంది..? ఆ సందర్భంగా ఏం జరిగింది..?

హైదరాబాద్. సెప్టెంబర్ 14

1947లో స్వాతంత్రానికి పూర్వం దేశంలోని 48 శాతం భూభాగం, 28 శాతం జనాభాతో 565 సంస్థానాలు ఉండేవి. చట్టపరంగా అవి బ్రిటిష్ ఇండియా లో భాగం కాదు, దాంతో పాటు అక్కడి నివసించే ప్రజల మీద ఎలాంటి బ్రిటిష్ అజమాయిషీ ఉండేది కాదు. కానీ, నిజానికి అవి బ్రిటిష్ రాజ్యానికి లోబడి ఉండేవి. ఈ నేపథ్యంలో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15, 1947 నాటికి ఈ సంస్థానాలు ఇటు భారత్‌లో కానీ, అటు పాకిస్థాన్‌లో కానీ విలీనం అవ్వవచ్చు అంటూ బ్రిటిషర్లు మెలికపెట్టారు. దీంతో రంగంలోకి దిగిన అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.. సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు.

ఈ క్రమంలో దాదాపు అన్ని సంస్థానాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విలీనం కాగా.. 3 సంస్థానాల విలీనం మాత్రం ఇబ్బందికరంగా మారింది. అందులో 7వ నిజాం చేతుల్లో ఉన్న హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానం ఒకటి. అతను హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయకపోవటంతో.. 1947, ఆగస్టు 15 వ తేదీన దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొన్నా.. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం విముక్తి లభించలేదు. అంతేకాదు.. ఈ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయటానికి నిజాం ప్రయత్నాలు చేయటంతో.. భారత ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది.

మిలటరీ ఆపరేషన్‌తో నిజాం సంస్థానాన్ని విలీనం చేయటానికి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య పేరే.. “ఆపరేషన్ పోలో”. అసలు ఈ ఆపరేషన్ కు పోలో అనే పేరు ఎందుకు పెట్టారంటే.. ఆ సమయంలో హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యధిక పోలో ఫీల్డ్‌లు ఉన్నాయి. నిజాం పాలనలో విందులు, విలాసాల్లో భాగంగా.. పోలో (గోల్ఫ్) ఆటను ఎక్కువగా ఆడేవారు. సో, ఆనాడు జరిగిన సైనిక చర్యకు సైతం ఇదే పేరును భారత ప్రభుత్వం ఫిక్స్ చేసింది. 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరుతో నిజాం సంస్థానంపై సమరభేరి మోగించింది.

1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ మొదలైంది ఇలా..

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13 తెల్లవారుజామున ‘ఆపరేషన్ పోలో’ పేరిట సైనిక చర్యకు దిగింది. అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయి పటేల్ ఆదేశాల మేరకు భారత సైన్యం.. నిజాం సంస్థానాన్ని నాలుగు వైపుల నుంచి దిగ్బంధించింది. హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ.రుద్ర మద్రాస్ వైపు నుంచి, బ్రిగేడియర్ శివదత్త.. బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. అయినా భారత సైన్యాన్ని ఎదురించేందుకు ప్రయత్నించిన నిజాం ప్రభువు.. కేవలం 5 రోజుల్లోనే తోకముడిచాడు.

సెప్టెంబర్ 14న ఏం జరిగింది..?:

దౌలతాబాద్, జాల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్ , వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలను సైన్యం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ దాడిని ఎదిరించలేక నిజాం సైనికులు పరుగులు తీశారు. కనిపించిన రోడ్లను, వంతెనలను ధ్వంసం చేశారు. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఆకాశంలో తిరుగుతున్న భారత యుద్ధ విమానాలకు తమ ఉనికి తెలిస్తే బాంబులు వేస్తారనే భయంతో రజాకార్లు ఇళ్లల్లో లైట్లు ఆర్పేయాలని హెచ్చరించారు.

సెప్టెంబర్ 16న ఏం జరిగింది? :

ఆ రోజు రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల వశమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్‌చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతర్లు పేల్చి సైన్యాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. కానీ సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. గత్యంతరం లేక ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు.

సెప్టెంబర్ 17న ఏం జరిగింది..?

ఆ రోజు సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించడంతో నగరవాసుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అడుగడుగునా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు భారత సైన్యం కవాతు చేసింది. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రసంగించారు. ‘నా ప్రియమైన ప్రజలారా!.. నా ప్రభుత్వం రాజీనామా ఇచ్చింది. ఈ పని ఇదివరకే చేయాల్సింది. ఆలస్యమైనందుకు విచారిస్తున్నా. యుద్ధం నుంచి నా సైన్యాన్ని విరమించుకుంటున్నా. ఐక్యరాజ్యసమితిలో పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకుంటున్నా’ అని ప్రకటించారు. ఆ తరువాత హైదరాబాద్ సంస్థానం లాంఛనంగా భారతదేశంలో విలీనం అయ్యింది. రజాకార్ల ఆగడాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *