Breaking News రాజకీయం

మరో రికార్డు సృష్టించిన సర్కార్ దవాఖానలు.. ఒక్క ఆగస్టులోనే 76.3 శాతం ప్రసవాలు..

106 Views

మరో రికార్డు సృష్టించిన సర్కార్ దవాఖానలు.. ఒక్క ఆగస్టులోనే 76.3 శాతం ప్రసవాలు..

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి.

ఇది గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తంచేశారు.

అత్యధికంగా నారాయణపేటలో 89% నమోదు
ఓవరాల్‌ పనితీరులో అదరగొట్టిన మెదక్‌ జిల్లా
వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు అభినందనలు
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచన

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు మరో రికార్డు సృష్టించాయి. ఆగస్టు నెలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే నమోదయ్యాయి. ఇది గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని ఆశాలు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ ఆఫీసర్లతో మంత్రి హరీశ్‌రావు మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 30 శాతంగా ఉండగా, సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశనంలో, వైద్యారోగ్య శాఖ చేస్తున్న కృషితో తొమ్మిదేండ్లలోనే రెట్టింపు కంటే ఎకువకు పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమని అన్నారు. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అభినందించారు. అత్యధిక ప్రసవాలతో టాప్‌లో నిలిచిన నారాయణపేట, ములుగు, మెదక్‌ తదితర జిల్లాల సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. తకువ డెలివరీలు నమోదైన మంచిర్యాల (63), నిర్మల్‌ (66), మేడ్చల్‌, కరీంనగర్‌ (67) జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలని సూచించారు. గర్భిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారికి రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు జరుగడంలో ఆశాలు, ఏఎన్‌ఎంలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. దీర్ఘకాలిక రోగాలు, ఇతర క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న గర్భిణులు గాంధీ దవాఖానలో ఏర్పాటుచేసిన సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌ సేవలు పొందేలా చూడాలని చెప్పారు.

అదరగొట్టిన మెదక్‌

ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌ ర్యాంకింగ్‌లో మెదక్‌ ఉత్తమ పనితీరు కనబరిచినట్టు మంత్రి అభినందించారు. టాప్‌-5లో నిలిచిన జిల్లాల సిబ్బందిని అభినందించారు. చివరి స్థానంలో ఉన్న జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నారాయణపేట, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రాథమికస్థాయి వైద్యం అందిస్తూ, ప్రజలను రోగాల బారి నుంచి కాపాడటంలో పీహెచ్సీ మెడికల్‌ ఆఫీసర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రజలకు అందేలా చూడాలని చెప్పారు.

అత్యధిక ప్రసవాల్లో టాప్‌-5 జిల్లాలు

నారాయణపేట 89.1%
ములుగు 87.5%
జోగులాంబ గద్వాల 85.1%
మెదక్‌ 86%
భద్రాద్రి కొత్తగూడెం 84.7%

వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్‌ ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎకడా అంతరాయం కలగకుండా చూసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్‌ కిట్‌ డాటా ఆధారంగా డెలివరీ తేదీ తెలుసుకొని ముందస్తుగా దవాఖానలకు తరలించాలని సూచించారు. సీజనల్‌ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, జిల్లా వైద్యాధికారులు పంచాయతీ, మున్సిపల్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాస రావు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *