మెగా రక్తదాన శిబిరం
పినపాక,సెప్టెంబర్ 02
పినపాక మండలం దుగినేపల్లి గ్రామ యూత్ ఆధ్వర్యంలో చేయూత స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహా రక్తదాన శిబిరాన్ని దుగినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్థానిక సీఐ శివ ప్రసాద్, ఎస్సై నాగుల్ మీరా ఖాన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆధ్వర్యంలో సేకరించగా సుమారు వందమందికి పైగా యువకులు రక్తదానం చేశారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మనిషి రక్తాన్ని దానం చేయడం తమ కర్తవ్యంగా భావించాలన్నారు. ప్రతి 3 నెలల నుండి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల అవతల వారి ప్రాణాలను కాపాడడమే కాకుండా దాత కూడా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండగలరని తెలిపారు. రక్తదానం యొక్క ఆవశ్యకతను, యువత రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్ధులకు వివరించారు. రక్తదానం చేసిన యువతను ఆయన అభినందించారు. యువత రక్తదానానికి ముందుకు రావడం ఆనందకర విషయమని చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సాయి ప్రకాష్ అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 45 సార్లు రక్తదానం చేసిన బిల్లం ప్రసాదరావు, 25సార్లకు పైగా రక్తదానం చేసిన గద్దల సాయిబాబు కు యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం రక్తదానం చేసిన యువతకు స్థానిక యూత్ ఆధ్వర్యంలో పండ్లు, పండ్ల రసాలు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక దుగినేపల్లి యూత్ సభ్యులు, ఆటో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.