//చరిత్రకంగా రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద రహదారిపై 2గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు.//
ఈ సందర్భంగా పలువురు జేఏసీ, రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ఒకప్పుడు తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన చేర్యాల రోజురోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలు చేసి అసెంబ్లీ జనగామ, ఎంపీ భువనగిరి, వ్యవసాయ డివిజన్ గజ్వేల్,
ఏసీపీ, విద్యుత్ హుస్నాబాద్, జిల్లా సిద్ధిపేట లకు విడదీసి చేర్యాల ప్రాంతాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని గత ఐదు సంవత్సరాల నుండి జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు వినతి పత్రాలు విన్నపాలు చేసి 56 గ్రామపంచాయతీలు తీర్మానం చేసి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మంత్రి హరీష్ రావులకు అందజేసినప్పటికీ కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంత ఉద్యమం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ప్రాంతేతరుడు కాబట్టే ఈప్రాంతం మీద సవతి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత బీఆర్ఎస్ నాయకులు అధిష్టానాన్ని ఒప్పించి చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. లేదంటే వారి పదవులకు రాజీనామా చేసి డివిజన్ ఉద్యమంలో కలిసి రావాలని వారు డిమాండ్ చేశారు.
