*పథకాల లబ్దిదారులకు గుడ్ న్యూస్ , ఫించన్ పెంపు – రూ లక్ష ఆర్దిక సాయం..!!*
*అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. హ్యాట్రిక్ విజయం పై కన్నేసిన సీఎం ప్రజలను ఆకట్టుకొనే నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు*.
ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా కొత్త వ్యూహాలతో కదులుతున్నారు. అందులో భాగంగా ఆసరా పెన్షన్ పెంపు దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పథకాల లబ్దిని పెంచేలా నిర్ణయాలు ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది.
ఆసరా ఫించన్ రూ 3,016కి పెంపు : వరుసగా మూడో సారి అధికారంలోకి రావాటం సీఎం కేసీఆర్ లక్ష్యం. సర్వేలు అనుకూలంగా ఉన్నాయని..అధికారం ఖాయమని సీఎం పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ఆకర్షణీయ పథకాలతో ముందుకొస్తున్న సమయంలో వారికి ఛాన్స్ ఇవ్వకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఆసరా ఫింఛన్లను మరో వెయ్యి రూపాయాలు పెంచేలా కసరత్తు జరుగుతోందని సమాచారం.
అదే విధంగా స్థలాలున్న పేదలు సొంతిల్లు కట్టుకోవటానికి రూ 3 లక్షలిచ్చే గృహలక్ష్మి పథకాన్ని మరింత పక్కాగా అలు చేసేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దుతున్నట్లు పార్టీ నేతల సమాచారం.
మైనార్టీలకు రూ లక్ష ఆర్దిక సాయం : ప్రతిపక్షాలు ప్రకటించే హామీలు..మేనిఫెస్టోలకు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ నాటికే అంచనాలకు అందని విధంగా నిర్ణయాల అమలు పైన ప్రకటనలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో దళితులకు రూ 10 లక్షల చొప్పున ఆర్దిక సాయం అందించే దళిత బంధు రెండో విడతలో భాగంగా రాష్ట్రంలో 1.30 లక్షల దళిత కుటుంబాలకు లబ్ది చేకూర్చేలా ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.
ఇదే తరహాలో వెనుకబడిన తరగతుల్లో కుల వృత్తులపై ఆధారపడిన మూడు లక్షల కుటుంబాలకు రూ లక్ష చొప్పున ఆర్దిక సాయం అందించేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తాజాగా మైనార్టీ వర్గాల వారికి రూ లక్ష చొప్పున ఆర్దిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కీలక నిర్ణయాల దిశగా : మైనార్టీక లక్ష రూపాయల ఆర్దిక సాయం అందిచే పథకానికి సంబంధించి విధి విధానాలు..లబ్దిదారుల ఎంపిక మార్గదర్శకాల పైన కసరత్తు మొదలైంది. అటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ఆకట్టుకొనేలా కొత్త పీఆర్సీ పైనా నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.
పీఆర్సీ నియామకంతో పాటుగా ఐఆర్ పైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా హెల్త్ స్కీం, హౌసింగ్, సీపీఎస్ పైన ముఖ్యమంత్రి నిర్ణయాల పైన ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ఇదే సమయంలో గ్రామాల వారీగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో నేరుగా ముఖాముఖి సమావేశాలకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు సమాచారం.





