దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ప్రధాని మోదీ విపక్ష పార్టీల సదస్సుపై విమర్శలను ఎక్కుపెట్టారు. పోర్టుబ్లెయర్‌లోని వీర్ సావర్కర్ అంతర్జాతీ విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే రెండింతల నిధులను అండమాన్ అండ్ నికోబార్ దీవుల కోసం వెచ్చించిందని పేర్కొన్నారు. పనిలో పనిగా విపక్షాలనుద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది వారి మంత్రం. పచ్చి అవినీతిపరులు సదస్సు జరుగుతోంది’’ అని విరుచుకుపడ్డారు.
‘‘ గత 9 ఏళ్లలో పాత ప్రభుత్వాల తప్పులు సరిచేయడంతోపాటు.. ప్రజలకు కొత్త సౌకర్యాలు, సదుపాయాలు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు భారత్‌లో కొత్తరకం అభివృద్ధి విధానం ఉంది. అదే సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అండమాన్-నికోబార్ దీవుల్లో పెరిగిన పర్యాటక రంగం మరిన్ని ఉద్యోగావకాశాలను సృష్టించిందన్నారు. కానీ, గతంలో స్వార్థపూరిత రాజకీయాలతో అభివృద్ధి పనులు మారుమూల ప్రాంతాలకు చేరడం సాధ్యం కాలేదన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో ఈ ద్వీపాల్లో పర్యాటక రంగం వృద్ధి చెందిందని పేర్కొన్నారు.
