దిల్లీ: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఊమెన్ చాందీ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కేరళ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన నిరాడంబరమైన వ్యక్తి. ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరం. మేమిద్దరం ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్న సమయంలో మా మధ్య ఎన్నో చర్చలు జరిగాయి. ఆ తర్వాత నేను దిల్లీకి వెళ్లిపోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’’అని ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోలను ప్రధాని ట్విటర్‌లో షేర్ చేశారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పటివరకు ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
