ప్రాంతీయం

త్వరలో గృహలక్ష్మి దరఖాస్తులు

84 Views

 ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం..

సొంత జాగాలు ఉండి ఇల్లు నిర్మించుకోవాలంటే వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నాం.

ఆన్‌లైన్ ద్వారా స్వీకరణ.. కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలన

ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి దరఖాస్తులు ఇచ్చే అవకాశం

జాగ ఉండి ఇల్లు కట్టుకొనే వారికి రూ.3 లక్షల సాయం

తెలంగాణలో ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. సొంత జాగాలు ఉండి ఇల్లు నిర్మించుకోవాలంటే వారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.3 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నది. ఈ పథకానికి త్వరలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా లేదా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి నేరుగా సమర్పించవచ్చు. జిల్లా కలెక్టర్ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో ఇండ్లు మంజూరవుతాయి. గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను గత నెల ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకానికి జిల్లాల్లో జిల్లా కలెక్టర్‌, జీహెచ్‌ఈ పరిధిలో కమిషనర్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ (టీఎస్‌హెచ్‌సీఎల్) ఆధ్వర్యంలో, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో ప్రత్యేకంగా పోర్టల్‌తోపాటు మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. దరఖాస్తుల స్వీకరణ దగ్గరి నుంచి ఇండ్ల ఆఫర్, బిల్లుల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. నిర్దేశించిన సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తే వెయిటింగ్‌ లిస్టు రూపొందించిన అనంతరం మంజూరైన ఇండ్లలో వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.

మహిళ పేరిట ఇండ్ల మంజూరు

గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యే ఇంటిని మహిళ పేరున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణం చేపట్టాక రూరల్‌లో సంబంధిత మండల అధికారులు, జీహెచ్‌ఎంసీలో అయితే సర్కిల్‌ అధికారులు నిర్మాణ పురోగతిని పర్యవేక్షిస్తారు. బేస్‌మెంట్‌, రూఫ్‌ లెవల్‌, కంప్లీషన్‌ మూడు దశల్లో ఫొటోలు తీసుకొని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ పురోగతిని బట్టి మూడు దశల్లో రూ.1 లక్ష చొప్పున రూ.3 లక్షలను లబ్ధిదారుడి ఖాతాకు బదిలీ చేస్తారు. ఈ నిధులపై పూర్తిగా సబ్సిడీ ఉంటుంది. అంటే ఇవి తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు. దీనికోసం ప్రత్యేక బ్యాంక్‌ ఖాతాను లబ్ధిదారులైన మహిళ పేర తెరుస్తారు. టీఎస్‌హెచ్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాష్ట్రస్థాయిలో పథకం అమలును పర్యవేక్షిస్తారు. పథకం అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అవసరమైన మార్గదర్శకాలు జారీచేసే అధికారం మేనేజింగ్‌ డైరెక్టర్‌కు కల్పించారు.

బడుగు, బలహీనవర్గాలకు 80 శాతం రిజర్వు

ఈ ఏడాది బడ్జెట్‌లో గృహలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12,000 కోట్లు కేటాయించింది. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3000 ఇండ్ల చొప్పున, స్టేట్‌ రిజర్వు కోటా కింద 43,000 కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇష్టమొచ్చిన డిజైన్‌లో ఇల్లు నిర్మించుకొనే వీలు లబ్ధిదారులకు కల్పించారు. కనీసం రెండు గదులు, టాయ్‌లెట్‌ మాత్రం తప్పనిసరిగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారు లేక ఎవరైనా కుటుంబసభ్యుడు ఆహార భద్రత కార్డు, స్థానిక ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కలిగి ఉండాలి. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు-20 శాతం, ఎస్టీలకు-10 శాతం, బీసీలు, మైనారిటీలకు 50 శాతానికి తగ్గకుండా ప్రాధాన్యం కల్పిస్తారు. ఇప్పటికే ఆర్‌సీసీ రూఫ్‌తో ఇల్లు (పక్కా ఇల్లు) ఉన్నవారు, జీవో-59తో లబ్ధిపొందినవారు ఈ పథకానికి అనర్హులు.

ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయింపు

ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3000 ఇండ్ల నిర్మాణం

రాష్ట్ర రిజర్వు కోటా కింద 43,000 గృహాలు

ఈ రాష్ట్రంలో 4 లక్షల ఇండ్లు కట్టడం లక్ష్యం

లక్ష చొప్పున 3 విడతల్లో లబ్ధిదారుడి ఖాతాకు నగదు జమ

జీవో 59తో లబ్ధిపొందినవారు ఈ పథకానికి అనర్హులు

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *