హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న భాజపా కోర్ కమిటీ సమావేశం కానుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతం, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన భాజపా ఎమ్మెల్యేల పర్యటనలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి ప్రకాశ్ జావడేకర్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ ఛుగ్ సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఖమ్మంలో ఈ నెల 29న భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనే బహిరంగ సభకు జనసమీకరణ సహా ఇతర కీలకాంశాలపై సమావేశంలో సమీక్షించనున్నట్లు ముఖ్యనేత ఒకరు తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రెండు పడకగదుల ఇళ్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఈ నెల 25న ఆందోళన చేపట్టాలని భాజపా నిర్ణయించింది.





