Breaking News

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్స్‌ సిద్ధం చేయాలని సంక్షేమ గురుకులాలు నిర్ణయించాయి

76 Views

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లోని విద్యార్థుల హెల్త్‌ప్రొఫైల్స్‌ సిద్ధం చేయాలని సంక్షేమ గురుకులాలు నిర్ణయించాయి. ఈమేరకు సంక్షేమ సొసైటీల పరిధిలో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి, ఆరోగ్యస్థితిని తెలియజేసేలా నివేదికలు రూపొందించనున్నారు. ఈ ఆరోగ్య నివేదికల ఆధారంగా విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడం వంటి సమస్యలను గుర్తించి.. ఆయా విద్యార్థులకు పౌష్టికాహారం అందించనున్నారు. అలాగే దృష్టిలోపం, ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వారికి అత్యవసర వైద్యచికిత్సలు అందిస్తారు. అవసరమైతే కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రీయ బాల్‌ స్వాస్థ్య కార్యక్రమ్‌ (ఆర్‌బీఎస్‌కే) కింద గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తారు. గురుకులాల్లో ప్రవేశాలు మూడో వారానికి పూర్తికానున్న నేపథ్యంలో జులై నెలాఖరు నుంచి ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. గురుకులాల్లో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.

*కరోనా తర్వాత తొలిసారిగా…*

గురుకులాల్లో విద్యార్థులకు ఏటా ఏప్రిల్‌లో వైద్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరిస్థితిని సమీక్షించాలి. విద్యార్థుల్లో అనారోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సలు అందించేందుకు ఈ పరీక్షలు ఉపయోగపడేవి. కరోనా వ్యాప్తి తర్వాత విద్యార్థులకు వైద్య పరీక్షలు జరపకపోవడంతో వారి అనారోగ్య సమస్యలు తెలుసుకోవడం కష్టమవుతోంది. కొందరు విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ బయటపడకపోవడం, తల్లిదండ్రులు చెప్పకపోవడం ప్రాణాలమీదకు వస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విద్యార్థులకు చికిత్స అందించేందుకు ఏర్పాటైన 24 గంటల హెల్ప్‌లైన్‌ కేంద్రం అవసరమైన వైద్య సలహాలు మాత్రమే ఇస్తోంది. విద్యార్థుల వైద్య నివేదికలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కోసారి సత్వర చికిత్సకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురుకులాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులందరి చదువు, వసతితో పాటు ఆరోగ్యంపై భరోసా ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించాయి. ఆర్‌బీఎస్‌కే బృందాలు గురుకుల పాఠశాలలకు చేరుకుని విద్యార్థులకు వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయి. రక్తపరీక్షలకు నమూనాలు తీసుకుని టీఎస్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో పరీక్షించనున్నారు. ఫలితాలను విశ్లేషించి, ఆ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయడంతో పాటు వైద్యచికిత్సలు అవసరమైన విద్యార్థులను సొసైటీలు గుర్తించనున్నాయి. నెల రోజుల్లో వైద్యపరీక్షలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సొసైటీలు.. విద్యార్థుల వైద్యానికి అయ్యే ఖర్చును భరించాలని యోచిస్తున్నాయి.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *