రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*
రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్ 24/7 మార్చి 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమ తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఇట్టి శిక్షణా కార్యక్రమాన్ని ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, జనార్దన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి, విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, విద్యా శాఖ సంచాలకులు దేవసేన లతో కలిసి హైదరాబాద్ నుండి వర్చువల్ మోడ్ లో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల అభీష్టం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నట్లు, ఇందుకు 80 వేల మంది ఉపాధ్యాయులకు, 9 వారాల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనిషి నిరంతర విద్యార్థి అని ఆమె అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యలో సమూల మార్పులు రానున్నట్లు, ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 8 వ తరగతులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె అన్నారు. భవిష్యత్తులో సమాజంలో పోటీ పడడానికి ఆంగ్ల మాధ్యమం కొరకు తల్లిదండ్రులు ప్రయివేటు పాఠశాలలకు తమ పిల్లలను పంపుతున్నట్లు, ప్రభుత్వ ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కానున్నట్లు మంత్రి తెలిపారు. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, సౌకర్యాల కల్పన చేస్తున్నట్లు ఆమె అన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ నుండి కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో 1500 మంది ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేసినట్లు, 60 మంది మాస్టర్ ట్రైనర్స్, 60 మంది మెంటర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకొని, లక్ష్య సాధనకు సమాయత్తమవ్వాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. మన ఊరు-మన బడి, మన బస్తి-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్స్ సూర్యనారాయణ, శైలజ, విద్యాసాగర్, పద్మజా, టెక్నికల్ పర్సన్ నరేష్ , రిసోర్స్ పర్సన్స్ గణేష్ ,మధు రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.





