సిద్ధిపేట జిల్లా లాభదాయకంగా ఉన్నదని, నికరలాభం వస్తుందని, అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పిలుపునిచ్చారు.
ఆయిల్ ఫామ్ తోటల సాగు పెరుగుదలతో జిల్లా రైతులకు మంచి భవిష్యత్తు ఉన్నదని, మొదటి ప్రాధాన్యత కింద ఆయిల్ ఫామ్ విరివిగా సాగు జరిగేలా డీడీలు చెల్లింపులు చేయడంలో చొరవ చూపాలని ఓ వైపు రైతులకు, మరో వైపు వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.
జిల్లా భవిష్యత్తు తరాల కోసం చేసే మంచి పనిలో అన్నీ గ్రామాల, మండల, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు ఈ మహా కార్యంలో భాగస్వామ్యం కావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
జిల్లా వ్యవసాయ, ఉద్యాన పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్ అధికారులు, జిల్లాలోని అన్నీ మండలాలు, గ్రామ రైతు బంధు సమితి నాయకులు, జిల్లాలోని ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా భూమి కలిగి ఉన్న రైతులు 300 మంది, మిగతా జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికార వర్గాలతో కలిపి 600 మందితో రాష్ట్ర మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి క్లస్టర్ వారీగా ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను నిర్దేశించారు.
ఆయిల్ ఫామ్ సాగుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. ఓ వైపు అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి ప్రత్యేక శ్రద్ధ వహించేలా మంత్రి హరీశ్ రావు వినూత్న రీతిలో నేరుగా ఆయిల్ ఫామ్ సాగు చేయాల్సిన రైతులతో స్పెషల్ డ్రైవ్ చేపడుతూనే రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఎదిగిన 12 నెలల ఆయిల్ ఫామ్ మొక్కలు సిద్ధిపేట జిల్లాలో ఉన్నాయని, పక్క జిల్లాలోని రైతులు కోరుతున్నారని వివరించారు. విజన్ కు అనుగుణంగా ముందుగానే మన సిద్ధిపేట జిల్లాకు తెచ్చిన ఆయిల్ ఫామ్ మొక్కలు రైతులు సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న రిజర్వాయర్ల ఖిల్లా సిద్ధిపేట జిల్లాలో 5 వేల ఎకరాలు సాగు అయ్యిందని, జిల్లా వ్యాప్తంగా 400 మంది 1700 ఏకరాలలో డ్రిప్ పెట్టిన తర్వాత జాప్యం జరగడంపై, అవసరమైన మేరకు మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని, ఈ విషయం పై జిల్లా వ్యవసాయ, హార్టికల్చర్, అటవీశాఖ, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఏంపీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులు డీడీలు కట్టిన రైతులకు త్వరగా మొక్కలు అందించేలా ఆయా క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులను చైతన్యం చేయాలని సూచించారు.
ఆయిల్ ఫామ్ మొక్కలు నాటేందుకు సబ్సిడీపై కూడా బడ్జెట్లో వెయ్యికోట్ల రూపాయలు కేటాయింపు చేశామని, దీన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లాలో 18 నెలల మొక్కలు 5వేల ఎకరాలకు సరిపడా సిద్ధంగా ఉన్నాయని, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, ఏఓ, ఏఈఓలు రైతులతో మాట్లాడి ఆయిల్ ఫామ్ సాగువైపునకు మళ్లేలా రైతులకు చైతన్యం చేయాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు నాటడం లక్ష్యం. కానీ ఇప్పటివరకు జిల్లాలో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా అనుకున్న మేర ముందుకు సాగడం లేదని, ఆయిల్ ఫామ్ సాగు పుంజుకునేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయా వ్యవసాయ అనుబంధ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులకు దిశానిర్దేశం చేశారు.
ప్రత్యేకించి జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్కరికీ 10 ఎకరాల భూమి విస్తీర్ణంలో కలిగి ఉన్న రైతులు 3215 మంది ఉన్నారని, వీరి మొత్తం భూమి 50 వేల 112 ఎకరాల మేర ఆయిల్ ఫామ్ తోటలు సాగుకు అనుకూలంగా ఉన్నట్లు, ఆయా రైతులంతా ఆయిల్ ఫామ్ తోటల సాగుకు రైతులు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని సూచనలు చేశారు.
ఇంకా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నదని, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి నాయకుల సమన్వయంతో అనుకున్న ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని మంత్రి సూచనలు, ఆదేశాలు జారీచేశారు.
ఆయిల్ ఫామ్ సాగు కోసం వంద శాతం రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు డ్రిప్ అందిస్తున్నట్లు, 90 శాతం రాయితీపై డ్రిప్ అందిస్తున్నట్లు రైతులకు అర్థమయ్యేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి ఆయిల్ ఫామ్ తోటల సాగుకై ముందుకు వచ్చేలా చూడాలని మార్గదర్శనం చేశారు.
జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఆయా మండలాల్లోని ప్రజా ప్రతినిధులు అందరూ రైతులతో ఈ దీర్ఘకాలిక పంటలపై, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆయిల్ ఫామ్ సాగుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని గ్రామ, మండల, జిల్లా రైతుబంధు సమితి నాయకులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
జిల్లాలోని వ్యవసాయ విస్తరణ, అధికారులు తమ తమ క్లస్టర్ పరిధిలోనీ రైతులతో సమావేశం నిర్వహించి , చైతన్యం చేసి ఆయిల్ ఫామ్ సాగు కోసమై రైతులు ముందుకు వచ్చేలా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ మేరకు జిల్లాలోని మండలాలు, గ్రామాల వారీగా ఆయిల్ ఫామ్ సాగుకై చేసిన, చేపట్టిన లక్ష్యాలను, చేపట్టాల్సిన లక్ష్యాలను వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మిలు మంత్రికి వివరించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ నాయకులు, ఏఈఓలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
====================