తెలుగు న్యూస్ మంచిర్యాల:
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీసర్వే లో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, సర్వే & ల్యాండ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి సర్వేవర్లకు రోవర్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కొరకు ప్రభుత్వం రీ సర్వే ప్రక్రియను చేపట్టిందని తెలిపారు. భూ రీసర్వే చేపట్టే సమయంలో పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, సెత్వార్, టిప్పన్, ఎఫ్.ఎం.బి., గ్రామ నక్షాలు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, సబ్ డివిజన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, రికార్డులలో ఉన్న వివరాలను క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులతో సరిపోల్చుకుంటూ సర్వే నిర్వహించాలని తెలిపారు. భూ రీసర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రోవర్లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, క్యూ జి ఐ ఎస్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని తెలిపారు. భూ రీసర్వే అనేది కేవలం భూముల కొలతలకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా ప్రతి భూ యజమానికి భద్రమైన హక్కులు కల్పించే కీలక కార్యక్రమమని, అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అనంతరం మండల సర్వేయర్లకు ప్రభుత్వం జారీ చేసిన 14 రోవర్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.





