విద్య, ఉద్యోగ రంగాల్లో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించేందుకు రోస్టర్ పాయింట్లను సవరించే వరకు ఐక్యంగా ఉద్యమించాలని రిటైర్డ్ కెనరా బ్యాంక్ ఏజీఎం, మాల కోఆర్డినేషన్ ఫోరం కోర్ కమిటీ సభ్యులు సీహెచ్. తిరుపతయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో డాక్టర్ అంబేద్కర్ అభ్యుదయ సంఘం, సిద్దిపేట మాలల జేఏసీ ఆధ్వర్యంలో రోస్టర్ పాయింట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలులో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన రోస్టర్ పాయింట్ల కేటాయింపుతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీజోన్ విధానం కారణంగా కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. మాలల రోస్టర్ పాయింట్లను 22 నుంచి 10లోపు తగ్గించే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాలలను చైతన్యవంతం చేయాలని కోరారు.





