మంచిర్యాల,దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు*క్షేత్రస్థాయి పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణతో సమగ్ర దర్యాప్తు *వాస్తవాలను వెలికితీసే దిశగా ప్రత్యేక బృందం: సీపీ అంబర్ కిషోర్ ఝా*
తెలుగు న్యూస్ మంచిర్యాల:
మంచిర్యాల జోన్‌లోని మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ బృందం సంఘటన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వ్యక్తులు,సాక్షులను విచారించడంతో పాటు సాంకేతిక ఆధారాలను సేకరించి విశ్లేషించనుంది. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా సంఘటనల వాస్తవాలను, సంబంధిత వ్యక్తుల పాత్రను నిష్పక్షపాతంగా నిర్ధారించనుంది.
దండేపల్లి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని సీపీ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఊహాజనిత, నిర్ధారణ కాని మరియు అసత్య సమాచారాన్ని నమ్మవద్దని,వాటి ఆధారంగా ప్రజలు ఆందోళనకు గురికావద్దని సీపీ సూచించారు. అధికారికంగా పోలీస్ శాఖ విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యత. శాంతిభద్రతల పరిరక్షణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.





