ప్రాంతీయం

దేవి రవీందర్ పై దాడి పిరికి పంద చర్య – దళిత ప్రజా సంఘాల ఆగ్రహం.

66 Views

గజ్వేల్ నియోజకవర్గ సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు దేవి రవీందర్‌పై దాడి చేయడాన్ని దళిత ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలో దేవి రవీందర్‌ను కలిసి దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఆస లక్ష్మణ్, డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్, న్యాయవాది పల్లెటూరి ప్రసాద్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలు ఐక్యంగా జరుపుకునే దసరా, బతుకమ్మ పండుగల సమయంలో గొడవలు సృష్టించడం సరికాదన్నారు. దేవి రవీందర్‌పై దాడి చేయడంతో పాటు ఆయన కారు అద్దాలను ధ్వంసం చేసి దూషించడం దారుణమని పేర్కొన్నారు. గ్రామంలోని మైసమ్మ గుడికి తాళం వేయడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారులు, దళిత నాయకులపై జరుగుతున్న దాడుల వెనుక మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హస్తం ఉందని వారు ఆరోపించారు. రాజకీయంగా ఎదుగుతున్న నాయకులపై దాడులకు పాల్పడటం తగదని, ఈ విషయంలో ఆయన తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటనలో కవ్వింపు చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల ఆధారంగా దళితులపై నమోదు చేసినట్లు వారు పేర్కొన్న కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు వాహనాలకు, విధులకు ఆటంకం కలిగించినట్లు చూపించే సీసీటీవీ దృశ్యాలు ఉన్నప్పటికీ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దళితులు ముందుగా ఫిర్యాదు చేసినప్పటికీ వారి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, మరో వర్గం ఫిర్యాదుపై తొలుత కేసు నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సంబంధిత సెక్షన్లను సరిచేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు రాజేందర్, సతీష్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *