పోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు
తెలుగు న్యూస్:
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంటెనరీ కాలనీ తెలంగాణ చౌరస్తా నుంచి మార్కెట్ చౌరస్తా వరకు, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద, మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో మందమర్రి పట్టణంలో పోలీసులు కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, lప్రజల ధన,మాన, ప్రాణాల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.వారి త్యాగాలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అసాంఘిక శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు పోలీసులు రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని, పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ అధికారులు కోరారు.





