సిద్దిపేట: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్, ఇతర అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, జ్ఞాపికలు అందజేశారు. అదనపు డీసీపీ కుశాల్కర్ మాట్లాడుతూ.. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఏడుగురు పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా అమరులైన 154 మంది పోలీసుల పేర్లను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





